10 August, 2026 | 3:27 AM

ఇంటర్ బోర్డులో నకిలీల భాగోతం

10-08-2026 01:06 AM
  1. మొన్న ఫైర్ ఎన్‌వోసీ.. నేడు నకిలీ సర్టిఫికెట్లు
  2. గతంలో 40, తాజాగా మరో 37 మంది లెక్చరర్ల గుర్తింపు
  3. తెలియకుండానే ఉద్యోగాలు పర్మినెంట్ చేసిన ఇంటర్ బోర్డు
  4. అధికారుల తీరుపై అనుమానాలు 

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యలో కొన్ని రోజులుగా నకిలీల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల వ్యవహారం మరువకముందే మరో నకిలీ వ్యవహారం బయటపడింది. దాదాపు 360 వరకు అనుమానిత జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లు తనిఖీ చేయగా అందులో 37 మంది జూనియర్ లెక్చరర్ల సర్టిఫికెట్లు నకిలీవని తేలింది.

వీరందిరికీ ఇంటర్ బోర్డు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2023లో 2909 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు, 184 మంది వరకు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ (పర్మినెంట్) చేసింది. అయితే గతంలో సర్టిఫికెట్లు పరిశీలనలోనే 40 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల మరో 37 మందివి కూడా నకిలీవేనని గుర్తించడం గమనార్హం. ఇంటర్మీడియట్ విద్యలో అసలింకెంత మంది నకిలీలున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

వీరంతా గత పదిహేను నుంచి ఇరువేళ్ల మధ్యలో నియమితులైన వారే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకం సమయంలో వీరి సర్టిఫికెట్లను పలు దఫాలుగా అధికారులు పరిశీలించారు. కానీ అప్పుడు వాటిని అధికారులు గుర్తించలేకపోయారా? లేకుంటే కావాలనే వదిలేశారా? అనే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇలా నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకున్న అధ్యాపకులు.. విద్యార్థులకు విద్యాబోధన ఎలా చేశారో?అంతుపట్టని అంశంగా ఉంది.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో అధికారుల పాత్ర ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నకిలీ వ్యవహారం ఇంటర్మీడియట్ విద్యలో బయటకు రావడంతో ఇంటర్ విద్య అప్రతిష్టపాలవుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం పోయే పరిస్థితులను తీసుకురాకుండా గట్టి చర్యలు, పకడ్బందీ నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.