21 July, 2026 | 9:13 AM

సరూర్‌నగర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ఎంపికలపై ట్రయల్స్

20-07-2026 08:29 PM

ఎల్బీనగర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ  ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం సోమవారం ఎంపికలపై ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఎంపికల ట్రయల్స్‌కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 136 మంది బాలురు, 22 మంది బాలికలు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపిక కమిటీ సభ్యులు ప్రతి క్రీడాకారుని శారీరక దారుఢ్యం, ఎత్తు, ఆట నైపుణ్యం, ఫిట్‌నెస్, సాంకేతిక ప్రతిభ, జట్టు సమన్వయం, క్రమశిక్షణ మొత్తం ప్రదర్శన క్షుణ్ణంగా పరిశీలించి ట్రయల్స్‌కు హాజరైన అభ్యర్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వాలీబాల్ అకాడమీలో ప్రవేశానికి ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి, వాలీబాల్ అకాడమీ అడ్మినిస్ట్రేటర్ ఎస్. స్వర్ణలత మాట్లాడుతూ సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయి శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎంపిక కాలేని క్రీడాకారులు కూడా నిరుత్సాహపడకుండా నిరంతరం సాధన కొనసాగించి భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభను కనబరచాలని ఆమె సూచించారు.