24 August, 2026 | 2:36 AM

10 చెట్లకు తీర్మానం.. నరికింది 50కి పైగా

24-08-2026 01:50 AM

ఇరిగేషన్, ఫారెస్టు అనుమతులు లేకుండానే.. 

సిద్దిపేట రూరల్, ఆగస్టు 23: సిద్దిపేట రూరల్ మండలంలోని బండచర్లపల్లి గ్రామంలో బండచెరువు కట్టకు 10 చెట్లు నరికివేయాలని పాలకవర్గం  తీర్మానించినట్లు సర్పంచ్ తెలిపిన సమాచారం విదితమే. తీర్మానించిన 10 చెట్లు కాకుండా 50కి పైగా చెట్లు నరికివేశారు. అయినా అధికారులు విచారణ జరపకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరుగుతుందనీ ఆరోపిస్తున్నారు.

అయితే చెరువు కట్టకు చెట్లు నరికేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పలు శాఖల అనుమతులు పొందాల్సిన అవసరం ఉంటుంది. అవేవీ నిబంధనలు పాటించకుండా చెట్లను నరికివేశారని గ్రామస్తులు ఆరోపణలు నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువుకట్టపై చెట్ల నరికివేత వార్త కథనం విజయక్రాంతి శనివారం  ప్రచురించింది. దాంతో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఆరా తీశారు. చెట్లు నరికివేయాలని తీర్మానించడంతో పాటు తమ శాఖల అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. గ్రామం పాలకవర్గం తీర్మానించినట్లు తమకు కనీస సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల అధికారులు విజయక్రాంతికి తెలిపారు. 

విచారణకు డిమాండ్

బాండచెరువు కట్టకు చెట్లు నరికిన ఘటనపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విజయక్రాంతి ప్రచురించిన కథనంతో విషయం వెలుగులోకి వచ్చిందనీ, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా విచారణ జరపాలని కోరుతున్నారు. ప్రభుత్వ వన సంపద నష్టం జరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.