భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి
*పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి
*విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
*కేజీబీవీలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాలి
*పెద్ద శంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్, ఆగస్టు 6 (విజయక్రాంతి): భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి కేజీబీవీలు పరిశుభ్రతకు నిలయాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పెద్ద శంకరంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి మొదటిగా తాసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులపై చర్చించిన అనంతరం, కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు.
అంతకుముందు తాసిల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ భారతి, రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు, మీ సేవలో వచ్చిన దరఖాస్తులను దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు.. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
అనంతరం కేజీబీవీ సందర్శించి పాఠశాలలోని వంటశాల (కిచెన్), తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న విద్య, వసతి, ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యార్థినుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతి కుమార్, కస్తూరిబా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






