23 March, 2026 | 11:28 PM

శిల్పకళా వైభవంతో మంత్రముగ్ధుడైన ట్రావెల్ రైటర్

23-03-2026 09:23 PM

వెంకటాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో యూకేకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ ను పర్యాటక శాఖ ఆహ్వానించింది. రాష్ట్రంలోని పర్యాటక, సాంస్కృతిక విశేషాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆయన తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా సోమవారం మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో స్థానం పొందిన రామప్పను సందర్శించారు.

ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళా వైభవం ఆయనను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ ఆలయ చరిత్ర, కాకతీయుల కళా సంపద, ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన విశేషాలను వివరించారు. ఫ్లోటింగ్ బ్రిక్స్ వినియోగం, సౌండ్ బాక్స్ టెక్నాలజీ, అద్భుత శిల్పకళ, ఆర్కిటెక్చర్ ప్రత్యేకతలను ఆయనకు తెలియజేశారు. పేరిణి శివతాండవం, తెలంగాణ పర్యాటక ప్రాముఖ్యతపై కూడా అవగాహన కల్పించారు.

తెలంగాణలోని పర్యాటక అవకాశాలు, సాంస్కృతిక సంపద, స్థానిక వంటకాల ప్రత్యేకతలను వివరించగా రాబర్ట్ పార్కర్ ఆసక్తి వ్యక్తం చేశారు. రాబర్ట్ పార్కర్ తన అనుభవాలను అంతర్జాతీయ వేదికల్లో పంచుకోవడం ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆయన వ్యాసాల ద్వారా యూరప్ దేశాలకు చెందిన పర్యాటకులు తెలంగాణ వైపు ఆకర్షితులవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో పర్యాటక శాఖ ప్రతినిధులు, టూరిజం గైడ్ విజయ్, టూరిస్ట్ పోలీస్ అరుణ్, కేంద్ర పురావస్తు మరియు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.