28 July, 2026 | 2:24 AM

సివిల్ కానిస్టేబుళ్లకు శిక్షణ

28-07-2026 01:38 AM

మూడు రోజుల రిఫ్రెషర్ కోర్సు ప్రారంభం

30 బ్యాచ్ లు.. 600 మందికి శిక్షణ...

ప్రో  యాక్టివ్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు మూడు రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 600 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లను 30 బ్యాచ్లుగా చేసి మూడు రోజులుగా శిక్షణ నిర్వహిస్తున్నారు.

మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా ఆధునిక పోలీసింగ్ విధానాలను ఎలా అవలంబించాలి, బేసిక్ పోలీసింగ్తో పాటు ప్రో-యాక్టివ్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించేందుకు శిక్షణనిస్తున్నారు.

ప్రతి కానిస్టేబుల్ గ్రామాలు, కాలనీలను నిరంతరం సందర్శిస్తూ ప్రజలకు సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళల భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా అవగాహన కల్పించడం, ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుంటూ నేరాల నివారణలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం (ఓపెన్ డ్రింకింగ్) వంటి ఉల్లంఘనలపై ఎలా ముందుకు సాగాలో వివరించే ఈ మూడు రోజుల రిఫ్రెషర్ కోర్సును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమ వారం అదనపు ఎస్పీ పి మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, డీసీఆర్బీ ఎస్‌ఐ ప్రవీణ్ లతో కలిసి ప్రారంభించారు. 

అన్ని రంగాల్లో అవగాహన కల్పించేందుకే...

పోలీసు సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహనతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విధంగా తమ విధులను నిర్వర్తించేందుకు సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణను ప్రారంభించారు. కేసు దర్యాప్తు సమయంలో పాటించాల్సిన ప్రమాణాలు, బ్లూ కోర్టు విధానాలు, డయిల్ హండ్రెడ్, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల తనిఖీలు, నూతన బీట్ సిస్టం ద్వారా నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించి పట్టుకునే పద్ధతులు, ఆయుధాల వినియోగం, పోలీసు శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నేరస్తుల వేలిముద్రల తనిఖీలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.

అదేవిధంగా సాయంత్రం సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం (ఓపెన్ డ్రింకింగ్) వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక పర్యవేక్షణ, చట్టప్రకారం చర్యలు తీసుకోవడంపై వివరించనున్నారు. 

ప్రో  యాక్టివ్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలి 

పోలీసులు బేసిక్ పోలీసింగ్ తో పాటు ప్రో - యాక్టివ్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలి. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ క్రమశిక్షణతో, నీతి-నిజాయితీతో, జవాబుదారీ తనంతో విధులు నిర్వహించాలి. చక్కటి యూనిఫాం ధరించి పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచాలి. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పై అధికారులు ఇచ్చే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తు ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించాలి. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.