6 July, 2026 | 2:17 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ యాక్షన్

06-07-2026 12:59 AM

మద్యం సేవించి వాహనాలు నడిపిన 190 మంది అరెస్టు

శేరిలింగంపల్లి, జూలై 5 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించడం,ప్రజా భద్రతను కాపాడడం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతం స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో 190 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వీరందరిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరం.

ఇలాంటి నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదం జరిగితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు. గత వారం రోజుల్లో కోర్టులో 376 డ్రంక్ డ్రైవ్ కేసులు పరిష్కారం అయ్యాయని పోలీసులు తెలిపారు.

వీటిలో 10 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా,నలుగురికి సామాజిక సేవతో పాటు జరిమానా,మిగిలిన 362 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.ప్రజలు బాధ్యతరహితంగా వ్యవహరించి,మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,తమ జీవితాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రక్షించలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.