పాల్వంచలో ట్రాఫిక్ తిప్పలు
- దమ్మపేట, నట్రాజ్, అంబేద్కర్ సెంటర్ల్లో నరకప్రాయాతన
రోడ్లపైకి చొచ్చుకొస్తున్న వ్యాపార సముదాయాలు.
పాల్వంచ, మార్చి 11(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. వ్యాపార సముదాయాలు నిబంధనలు పాటించకుండా, సెట్ బ్యాక్ తీసుకోకుండా భవనాలు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో వినియోగదారులు రోడ్లపైనే వాహనాలు నీలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలకు మించిన భారమైంది. ఉదయం సాయంత్రం వేళల్లో ద్విచక్ర వాహనం సైతం నడపలేని పరిస్థితి నెలకొంటుంది.
ప్రధానంగా పట్టణంలోని అత్యంత కీలకమైన దమ్మపేట సెంటర్ (కూడలి) వద్ద ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు, షాపుల యజమానులు తమ పరిధిని దాటి రోడ్డుపైకి రావడం, ఆక్రమణలకు పాల్పడటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రహదారి..
దమ్మపేట, నటరాజ్ సెంటర్, కేఎస్పీ రోడ్డు, అంబేద్కర్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న షాపుల ముందర వ్యాపారస్తులు తమ సామాగ్రిని రోడ్డు మార్జిన్ వరకు విస్తరించడంతో ప్రధాన రహదారి ఇరుకుగా మారుతోంది. అంబేద్కర్ సెంటర్లో రిలయన్స్ మార్ట్ వద్ద రోడ్డుపైనేవాహనాలు నిలపడంతో భద్రాచలం కొత్తగూడెం ప్రధాన రహదారిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదే క్రమంలో కేఎస్పీ రోడ్డు నుంచి భద్రాచలం రోడ్డుకు యూటర్న్ తీసుకోవడం ప్రమాద భరితంగా మారింది. దీనికి తోడు, సముదాయాలకు వచ్చే కస్టమర్లు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. భారీ వాహనాలు ఈ కూడలి గుండా వెళ్లే సమయంలో తరుచు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ప్రమాదాలకు నిలయంగా కూడలి..
నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ సెంటర్లో రోడ్లపై పార్కింగ్ కారణంగా తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు నడవడానికి కూడా చోటు లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు చొరవ చూపాలి..
ఈ తీవ్రమైన సమస్యపై మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. పాల్వంచ పట్టణ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ఈ ట్రాఫిక్ గందరగోళానికి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.




