12 March, 2026 | 8:38 AM

బాలాపూర్ స్కూల్ నిధుల గోల్‌మాల్

12-03-2026 12:00 AM

బడంగ్‌పేట్, మార్చి 11( విజయక్రాంతి): బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి నిధుల దుర్వినియోగంపై బుధవారం బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. 

పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన రూ.40 లక్షలు, అలాగే ’పీఎం శ్రీ’ పథకం కింద మంజూరైన రూ.10 లక్షల నిధులను పనులు చేయకుండానే స్వాహా చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. శిథిలావస్థకు చేరిన భవనానికి కేవలం రంగులు వేసి, ఒక స్థానిక నాయకుడు కాంట్రాక్టర్తో కలిసి నిధులు కాజేశారని విమర్శించారు.ఈ అవినీతిపై జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఈ వ్యవహారంలో రామానుజన్ రెడ్డి అనే పాఠశాల ఉపాధ్యాయుడి ప్రమేయం ఉందని, నిధులపై ప్రశ్నిస్తే ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు.జిల్లా విద్యాశాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే విచారణ చేపట్టి, ప్రభుత్వ నిధులను దారి మళ్లించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నడికుడి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్‌రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.