12 March, 2026 | 3:27 AM

Breaking News

ఔషధ గని ఓమ!

12-03-2026 12:00 AM
  1.   360 రోగాలకు ఔషధం
  2. రైతన్నకు భాగ్య రాశి
  3. ఆసక్తి చూపుతున్న ఉమ్మడి జిల్లా రైతులు

చేవెళ్ల, మార్చి 11 (విజయక్రాంతి): ‘ఓమ పూతల మీది తేనె పట్టుకరా కాస్త...‘ అంటూ పల్లెల్లో ఇల్లాలు తన భర్తను కోరడం వెనుక ఒక గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 360 రోగాలకు మందుగా పిలవబడే ‘ఓమ’ (వాము), ప్రస్తుతం చేవెళ్ల, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లోని నల్లరేగడి, ఎర్రరేగడి భూముల్లో విరివిగా సాగవుతోంది. ఔషధ గుణాలతో పాటు ఆర్థికంగానూ రైతులకు చేదోడుగా నిలుస్తోంది ఈ పంట.

సాగు విధానం.. విశేషాలు

తెలంగాణ మాండలికంలో వామ లేదా వాము అని పిలిచే ఈ పంటను రబీ సీజన్లో (సెప్టెంబర్ - అక్టోబర్) సాగు చేస్తారు. విత్తే ముందు ఒకరోజు నీటిలో నానబెట్టి, పొలంలో పదును చూసి వెదజల్లుతారు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పంట చేతికి వస్తుంది. వృక్ష శాస్త్రం ప్రకారం దీని పేరు అజ్వైన్ అమ్మి. ఇది అపియేసి కుటుంబానికి చెందినది.

పశువులు మేస్తేనే అధిక దిగుబడి!

సాధారణంగా ఏ పంటనైనా పశువులు మేస్తే పంచాయతీ అవుతుంది, కానీ ఓమ పంట విషయంలో మాత్రం ఇది భిన్నం. మొక్కలు ఏపుగా పెరిగి పూత పూయకముందే గొర్రెలు లేదా మేకలను మేపుతారు. దీనివల్ల మొక్క పైభాగం (శీఘ్ర భాగం) తెగిపోయి, మరిన్ని శాఖలు (కొమ్మలు) వస్తాయి. తద్వారా పూత, కాత పెరిగి అధిక దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.

తేనెటీగల సందడి.. ఫలదీకరణ...

ఓమ పూత దశలో ఉన్నప్పుడు పొలంలో తేనెటీగలు, కీటకాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఔషధ మకరందం కోసం వచ్చే ఈ కీటకాల వల్ల పుప్పొడి రేణువులు ఒక పుష్పం నుండి మరో పుష్పానికి చేరి ఫలదీకరణ వేగంగా జరుగుతుంది. అందుకే ఓమ పూల మీది తేనెకు పల్లెల్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఎకరాకు సుమారు 5 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది.మార్కెట్లో క్వింటాలుకు రూ. 12,000 నుండి రూ. 20,000 వరకు ధర పలుకుతోంది.విత్తనం పచ్చగా ఉంటే ధర ఎక్కువగా, ముదురు గోధుమ రంగులో ఉంటే తక్కువగా ఉంటుంది.

అందుకే సరైన తేమ ఉన్నప్పుడే కోసి ఆరబెట్టడం కీలకం.ఓమను నూర్చడం (కళ్ళం చేయడం) కొంత కష్టమైన పని. ఎండిన కట్టలను గొర్రు లేదా గుంటుక దిండుపై బాది విత్తనాలను వేరు చేస్తారు. గాలికి తూర్పారబట్టి పొట్టు, తాలు వేరు చేస్తారు. ఈ ప్రక్రియలో విత్తనాల్లో మట్టి, ఇసుక పడకుండా రైతులు ఎంతో జాగ్రత్త వహిస్తారు.

కళ్ళంలో పనిచేసే సమయంలో ఆ వాము సువాసన పీల్చడం వల్ల శ్వాసకోస సమస్యలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతుల నమ్మకం.వంటకాల నుండి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు, ఇంటి వైద్యం నుండి ఆయుర్వేదం వరకు ఓమకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా,చేవెళ్ల,వికారాబాద్ జిల్లా రైతులు దీనిని సాగు చేస్తూ ‘ఆరోగ్య భాగ్యరాశి‘ని పండిస్తున్నారు.