మృత్యుశకటాలుగా మారుతున్న ట్రాక్టర్లు
- నిర్లక్ష్యమా? ప్రాణాలంటే లెక్కలేనితనమా?
- పట్టించుకోని ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు
ఆమనగల్లు, మే 7 (విజయక్రాంతి): ఆమనగల్లు ప్రాంతంలో ట్రాక్టర్ల డ్రైవర్ల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, అడ్డగోలుగా సాగిస్తున్న రవాణా సామాన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా మట్టి, మొరం, చీకులు మరియు పునాది రాళ్లను తరలించే క్రమంలో ట్రాక్టర్ల వెనుక డోర్లు బిగించకపోవడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆమనగల్లు - షాద్ నగర్, మాడుగుల తలకొండపల్లి, కడ్తల్ ప్రధాన రహదారిపై వెనుక డోర్లు లేకుండా, భారీ రాళ్లతో నిండిన ట్రాక్టర్లు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటున్నాయి. ప్రయాణంలో కుదుపులు వచ్చినప్పుడు లేదా మలుపుల వద్ద ఈ రాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడితే, వెనుక వచ్చే వాహనదారుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
నిబంధనల ఉల్లంఘన..
మోటార్ వాహనాల చట్టం ప్రకారం లోడుతో వెళ్లే ఏ వాహనమైనా సురక్షితంగా మూసి ఉండాలి. కానీ, ఇక్కడ డ్రైవర్లు సమయం ఆదా చేసేందుకో లేదా సోమరితనంతోనో డోర్లు బిగించడం లేదు. పగలు కంటే రాత్రి సమయాల్లో ఇలాంటి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. వెనుక కనీసం రేడియం స్టిక్కర్లు లేదా హెచ్చరిక లైట్లు లేకపోవడంతో, వెనుక నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు వీటిని గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు.లోడు ఉన్నప్పటికీ, చాలా మంది డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడపడం వల్ల రోడ్లపై మట్టి పడి, వర్షం వచ్చినప్పుడు లేదా మలుపుల వద్ద బైక్లు జారి పడిపోతున్నాయి.
అధికారుల మౌనం..
ప్రధాన రహదారులపై ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, అటు రవాణా శాఖ గానీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు పాటించని ట్రాక్టర్లను సీజ్ చేయాలి. ప్రమాదకరంగా రాళ్లు తరలించే డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేయాలి. రహదారి భద్రతపై డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి, ప్రాణాంతకమైన ఈ ’ఓపెన్ డోర్’ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు మరియు స్థానికులు కోరుతున్నారు. లేదంటే ఏదైనా ఘోర ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం వల్ల లాభం లేదని హెచ్చరిస్తున్నారు.






