కొలనూర్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు.. బెల్టుషాపులపై కఠిన చర్యలు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ సర్పంచ్ అరవింద రావు ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీ సాధారణ పాలకవర్గ సమావేశంలో కొలనూర్ గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నిర్ణయం మేరకు గ్రామంలో బెల్టుషాపుల ద్వారా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ మద్యం విక్రయాలు నిర్వహించినట్లయితే సంబంధిత వ్యక్తికి రూ.20,000 జరిమానా విధించనున్నట్లు గ్రామపంచాయతీ ప్రకటించింది. అదేవిధంగా మద్యం విక్రయాల గురించి సమాచారం అందించిన వ్యక్తికి రూ.5,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించింది.గ్రామంలో శాంతి భద్రతలు, ప్రజల ఆరోగ్యం మరియు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ ప్రజలు సంపూర్ణ మద్యపాన నిషేధ అమలుకు సహకరించాలని కోరారు.






