14న ట్యాంక్‌బండ్‌పై తిరంగా యాత్ర
ఏర్పాట్లపై సమీక్షించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా యాత్రను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ యాత్రకు సంబంధించి మంగళవారం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జరగనున్న ఈ తిరంగా యాత్రను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు,
కార్యక్రమ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో రాంచందర్ రావు చర్చించి దిశానిర్దేశం చేశారు. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జాతీయ జెండాలతో తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా ఈయాత్రకు అనుమతినివ్వాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు బీజేపీ నేతలు గౌతమ్ రావు, శిల్పా రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు కలిసి కోరారు.






