12 August, 2026 | 8:31 AM

ఆ కంపెనీతో సీఎం సోదరులకు సంబంధం లేదు

12-08-2026 01:15 AM
  1. మీ హయాంలో ముడుపులు తీసుకునే భూములిచ్చారా? 
  2. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన భూములపై విచారణ చేయిస్తాం 
  3. భూమి కోసం 32 కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే అందులో టెస్సరాక్ట్ కంపెనీ ఉంది
  4. నాకు తెలియకుండా నా శాఖలో ఏమీ జరగదు 
  5. కేటీఆర్‌పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): భూముల కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరులకు భూ కేటాయింపులు చేశారని కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, టెస్సరాక్ట్ కంపెనీకి సీఎం సోదరులతో సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.90 లక్షలకు ఎకరం భూమి ఇస్తే..తమ ప్రభుత్వం రూ.కోటిన్నరకు ఎకరం భూమి ఇచ్చిందని తెలిపారు.

బోర్డు డిసైడ్ చేసినదాని కంటే తాము రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదని, 32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెస్సరాక్ట్ కంపెనీ ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ముడుపులు తీసుకునే కంపెనీలకు భూము లు ఇచ్చారా..?  ‘మీరు ఎందుకు తక్కువ ధరకు భూములు ఇచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలి’అని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ‘నా శాఖలో ఎవరో చెబితే నేను పనిచేసే రకం కాదు .. నా శాఖలో జరిగిన ప్రతీ నిర్ణయం నాకు తెలుసు’ అని మంత్రి పేర్కొన్నారు.

మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఏ కంపెనీ అయినా ప్రారంభంలో క్యాపిటల్ అమౌంట్ తక్కువ ఉంటుందన్నారు. టెస్సరాక్ట్‌కు సీఎం సోదరులకు సంబంధం లేదని, సోషల్ మీడియా పోస్ట్‌ల ఆధారంగా కేటీఆర్ ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. 5 ఎకరాలలో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల కంపెనీ అని కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

నియమ నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, ఎవ్వరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. వాళ్లకి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పత్రికల్లో రాస్తారని నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావొద్దనే హిడెన్ ఎజెండాతో కేటీఆర్ ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో లీజుకు ఇచ్చిన భూములను రెగ్యులరైజ్ చేశారని, అప్పుడు కేటీఆర్‌కు తప్పు అనిపించలేదా? అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు.

‘మేము హిల్ట్ పాలసీ ద్వారా నిరూపయోగంగా ఉన్న రెగ్యులరైజ్ అయిన భూములను  బదలాయింపునకు ప్రయ త్నం చేస్తున్నాం’ అని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే దోపిడీ జరిగిందని, భూము ల కేటాయింపుపై విచారణ చేయిస్తామన్నా రు. ఈ విషయంలో ‘మాకు లేని ఆలోచనలు కల్పించారు’అని తెలిపారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాట అని అన్నారు.

తమ ప్రభుత్వానికి కక్షధోరణి కానీ వ్యక్తిగతంగా కానీ లేదని, చట్ట ప్రకారం ముందుకు వెళ్లుతున్నామని, తాము కక్షతో ముందుకెళ్లితే మీరంతా ఎక్కడో ఉండేవాళ్లో తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా..  భయపెట్టినా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.

పీఎం ఏక్తా మాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం మాల్ నిర్మాణం జరుగుతోందన్నారు. రూ.200 కోట్ల సాఫ్ట్ లోన్ తిరిగి చెల్లించాల్సిందేనని, పీపీపీ మోడల్‌లో టెండర్ జరిగిందన్నారు. ప్రీ బిడ్డింగ్‌లో 7 మంది బిల్డర్లు పాల్గొంటే ఇద్దరిని ఎంపిక చేసారని మంత్రి తెలిపారు. పీఏం ఏక్తా మాల్ నిర్మాణంలో ప్రభుత్వపై భారం లేకుండా లాభం జరుగుతుందన్నారు.