నకిలీ సర్టిఫికెట్ల లెక్చరర్లు
- వరంగల్‌లో ముగ్గురికి నోటీసులు
- ఫేక్ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు?
మహబూబాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నకిలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల ద్వారా జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు గా కొందరు దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందారనే ఫిర్యాదుల నేపథ్యంలో 37 మందికి ఇం టర్ బోర్డు ఆర్‌జేడీ నోటీసులు జారీ చేయగా, ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2014, జూన్ 2 వరకు కాంట్రాక్టు విధానం ద్వారా ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యాబోధన చేసిన ఆధ్యాపకుల ను 2023లో ప్రభుత్వం రెగ్యులర్ చేసింది.
ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 351 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగ క్రమబద్ధీకరణ (రెగ్యులర్) పొందారు. అయితే ఇందులో సుమారు 20 మందికి పైగా ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించినట్లు ధ్రువపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఆయా రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ‘వెరిఫికేషన్’ కోసం పంపించింది.
ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ముగ్గురికి సంబంధించిన ఉన్నత విద్యార్హతల సర్టిఫికెట్ల వివరాలు తమ వద్ద లభించడం లేదని వాటిని ‘నాట్ ఫౌండ్’గా పేర్కొంటూ ఆయా విద్యాసంస్థలు ఇంటర్మీడియట్ బోర్డ్ కు నివేదిక అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో భూపాలపల్లి జిల్లాలో ఒకరు, జనగామ జిల్లాలో ఒకరు, మహబూబాబాద్ జిల్లాలో ఒకరికి ఇంటర్ బోర్డు ఆర్‌జేడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.వారం రోజుల్లో షోకా జు నోటీసులకు సదరు అధ్యాపకులు ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు మహబూబాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి మదార్ గౌడ్ తెలిపారు.






