21% ఓట్లు గాయబ్
తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లకు..
వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు 2.64 కోట్లే!
- 73.39 లక్షల ఫారాల జాడలేదు
- వీటిలో మరణించిన ఓటర్లు, డబుల్ ఓటర్లు, ఇతర కారణాలతో ఇవ్వనివారున్నారు
- ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 73,39,234 ఓట్లు తగ్గినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఎస్‌ఐర్ ప్రక్రియ సోమవారంతో గడువు ముగియడంతో మంగళవారం సీఈ వో కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,26,448 ఉండగా అం దులో 2,64,87,214 ఓటర్లకు సం బంధించి ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమేనని డిజిటలైజేషన్ చేసినట్లు పేర్కొన్నారు.
73,39,234 ఓట్లకు సం బంధించిన ఎన్యూమరేషన్ పత్రాలు రాలేదని అధికారులు స్పష్టంచేశారు. వీటిలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఓటర్లు 45,18,961, మరణించిన ఓటర్లు 9,22,230, అందుబా టులో లేని ఓటర్లు 11,25,546, మరో చోట ఓటు ఉన్న వారు (డబుల్ ఓటర్లు) 6,70,203, ఇతర కారణాలతో ఎన్యూమరేషన్ కాని వారు 1,02,294 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు.
17న ముసాయిదా జాబితా..
మొత్తం ఓటర్లలో 78.30 శాతం మంది వివరాలు డిజిటైజ్ కాగా మిగిలిన 21.70 శాతం ఫారమ్‌లు.. మరణాలు, చిరునామా మార్పులు, డబుల్ ఓట్లు ఎన్యూమరేషన్ పత్రాలు సేకరించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. దీంతో ఈనెల 17వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేయబోతున్న ముసాయిదా ఓటరు జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది.
ఈ ముసాయిదా జాబితాలో ఎవరి ఓటు ఉండబోతోంది.. ఎవరి పేరు గల్లంతు కాబోతోంది అనేది సస్పెన్స్‌గా మారింది. ముసాయిదా వెలువడిన అనంతరం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటి పరిష్కారాన్ని అక్టోబర్ 15వ తేదీలోపు పూర్తిచేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 19 వరకు తుది ఓటరు జాబితాను వెల్లడించనున్నారు.
రాజకీయ పార్టీలు అప్రత్తం..
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ఓటరు జాబితాలో పెద్దఎత్తున మార్పులు సంభవించబోతున్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అనామలీస్ జాబితాలో 73 లక్షల ఓట్లు ఉన్నాయంటే పార్టీకి ఇంత యంత్రాంగం ఉండి ఏమి లాభం అని పార్టీనేతలను ప్రశ్నించినట్లు సమాచారం.
ఇకనైనా ఇంటింటికి వెళ్లి తనిఖీ చేపట్టాలని, అర్హత కలిగిన వారు ఓట్లు కోల్పోతే అది పార్టీకి నష్టం చేస్తుందని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్, బీజేపీ సైతం తమ నేతలతో భేటీ అయి, గల్లంతవుతున్న ఓట్ల విషయంలో పార్టీ శ్రేణులను అలర్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీంతో తగ్గిన 73,39,234 ఈ ఓట్లలో చివరకు ఎన్ని ఉంటాయి.. ఎన్ని గాయాబ్ అవుతాయి అనేది రాజకీయ పార్టీలకు టెన్షన్‌గా మారింది.






