ఇక స్మార్ట్ రేషన్ కార్డులు
- 3.43 కోట్ల లబ్ధిదారులకు 1.06 కోట్ల కార్డులు
- 15న సంగారెడ్డిలో బహిరంగ సభ
- అక్కడే కార్డుల పంపిణీకి సీఎం శ్రీకారం
- రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏకకాలంలో కార్యక్రమాలు
- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణలో ఆహార భద్రతకు ఇక స్మార్ట్ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదా రులకు సంబంధించిన 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి స్వాతం త్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డిలో జరిగే స్మార్ట్ కార్డుల ప్రక్రియను సీఎం లాంఛనంగా ప్రారంభిం చనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పౌర సరఫరాల సంస్థ అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోనూ మాట్లాడి సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,28,092 ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత ఏడాది జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను జారీ చేసి, వాటి ద్వారా 61,08,544 మంది లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు.
సంగారెడ్డి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల తరలింపు, సీటింగ్, భద్రత, కార్డుల పంపిణీతో పాటు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక చేయాలన్నారు.
మిగిలిన జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపాలని, అవసరమైన వ్యయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. 1.06 కోట్ల కార్డులు -3.43 కోట్ల లబ్ధిదారులు -ఉచిత సన్నబియ్యం వంటి కీలక అంశాలతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాతో పాటు షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
లక్ష మందితో సంగారెడ్డిలో బహిరంగ సభ..
15న సంగారెడ్డిలో నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు భారీ జన సమీకరణ, వేదిక ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం సంగారెడ్డికి చేరుకుంటారని, సాయంత్రం 4 గంటల వరకు సంగారెడ్డిలో ఉంటారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల నుండి నియోజకవర్గానికి ఒకరు చొప్పున, మొత్తం పది మంది లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపైనే స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తారని మంత్రి తెలిపారు. సుమారు లక్ష మంది జనంతో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి స్పష్టం చేశారు.






