12 August, 2026 | 3:02 AM

రక్తమోడిన రహదారులు!

12-08-2026 01:33 AM
  1. సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
  2. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్
  3. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి
  4. మృతులంతా కర్ణాటకకు చెందిన మహిళా కూలీలే
  5. కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద అదుపు తప్పిన కారు
  6. డివైడర్ ఢీకొని అవతలి వైపు పల్టీ కొట్టడంతో ఇద్దరు మృతి
  7. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి)/జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు. జహీరాబాద్, కోహీర్ మండలాల పరిధిలో జరిగిన ఈ ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలావున్నాయి. వ్యవసాయ కూలీలతో ప్రయాణిస్తున్న ఒక ఆటోను హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ లారీ వెనుక నుండి చాలా వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జవగా, అందులో ప్రయాణిస్తున్న 12 మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు తెలిపారు. మరణించిన వారంతా కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరు ప్రతిరోజూలాగే జహీరాబాద్ ప్రాంతానికి కూలి పనుల కోసం వచ్చి, పని ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా సత్వార్ యూటర్న్ వద్ద ఈ విషాదం జరిగింది.

గాయపడిన వారిలో నలుగురిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి, ఇద్దరిని సంగారెడ్డికి తరలించారు. మృతి చెందిన వారిలో రాజగిరి గ్రామానికి చెందిన రేఖ, శ్రీదేవి, కవిత, రేష్మా, దేవదాస్ (ఆటో డ్రైవర్), ఆటో డ్రైవర్ భార్య నిఖిత ఉన్నారు. గాయపడిన వారిలో నిర్మల, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభ ఉన్నారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

డివైడర్ ఢీకొని ఎగిరిపడిన కారు, ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65 పై కోహీర్ మండలం వెంకటాపూర్ (కవేలి) వద్ద అతివేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి వైపునకు ఎగిరిపడింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలను ఈ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎంఆర్‌ఎఫ్ ఉద్యోగి మల్లిఖార్జున, సదాశివపేట మున్సిపల్ ఉద్యోగి శంకర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు ఢీకొనడం వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ రెండు ప్రమాదాల సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘటన విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన  వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, సంగారెడ్డి డీఎంహెచ్‌వోను మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి సానుభూతి ప్రకటించారు.

అత్యంత బాధాకరం: హరీశ్‌రావు 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సత్వార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందడం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాంకర్ ఢీకొట్టిన ఈ ఘటన అత్యంత బాధాకరం అన్నారు.  ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని హరీశ్ రావు కోరారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించి వారికి అండగా నిలవాలని ఆయన కోరారు.