1 September, 2026 | 1:31 AM

మూడు నెలల కోటా.. రేషన్ షాపుల్లో నో స్టాక్!

01-09-2026 12:00 AM
  1. మూడు నెలల కోటా పంపిణీపై గందరగోళం.. 
  2. ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న కార్డుదారులు
  3. మాకు రావాల్సిన బియ్యం ఎప్పుడిస్తారంటూ నిలదీత 

నాగోల్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): నాగోల్ లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో నెలకొన్న గందరగోళం లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. అయితే కొన్ని దుకాణాల్లో సరిపడా బియ్యం అందుబాటులో లేకపోవడంతో కార్డుదారులు గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

షాపుకు వెళ్తే.. ‘స్టాక్ లేదు’!

రేషన్ కార్డులో తమకు బియ్యం కోటా ఉన్నప్పటికీ, దుకాణానికి వెళ్లినప్పుడు బియ్యం లేదనే సమాధానం రావడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద వేచి ఉన్నా బియ్యం అందకపోవడంతో పనులు మానుకుని రావాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు రేషన్ కోసం గంటల తరబడి వేచి ఉండటం భారంగా మారిందని అంటున్నారు.

డీలర్లకు సైతం తప్పని ఇబ్బందులు

మరోవైపు, రేషన్ డీలర్లు కూడా సరఫరా సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తమకు రావాల్సిన కోటా పూర్తిస్థాయిలో అందకపోవడంతో లబ్ధిదారులందరికీ బియ్యం పంపిణీ చేయలేకపోతున్నామని వారు చెబుతున్నారు. బియ్యం సరఫరా ఎప్పుడు పూర్తవుతుంది? మిగిలిన కోటా ఎప్పుడు వస్తుంది? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో డీలర్లకు, లబ్ధిదారులకు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

పర్యవేక్షణ ఎక్కడ?

మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో రేషన్ దుకాణాలకు అవసరమైనంత బియ్యం ముందుగానే చేరవేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. దుకాణాల్లో స్టాక్ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఏ దుకాణంలో ఎంత బియ్యం ఉంది? ఇంకా ఎంత కోటా రావాల్సి ఉంది? లబ్ధిదారులందరికీ పంపిణీ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే వివరాలను అధికారులు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మా బియ్యం మాకివ్వండి

రేషన్ బియ్యం కోసం పేదలు ప్రతిరోజూ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని నాగోల్ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యం మా హక్కు.. దాన్ని పొందేందుకు మమ్మల్ని రోజుల తరబడి తిప్పకండి. కోటా పూర్తిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని లబ్ధిదారులు కోరుతున్నారు.