1 September, 2026 | 12:27 AM

నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ గణిత పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు

31-08-2026 11:23 PM

'స్ప్రింగర్ నేచర్' జర్నల్‌లో ప్రచురితమైన 'కేఆర్ డిఫెక్ట్' పద్ధతి

వైద్యం, డేటా ప్రసార రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

​నర్సాపూర్: ప్రభుత్వ అధికారిగా ప్రజాసేవలో బిజీగా ఉంటూనే, సంక్లిష్టమైన గణిత, భౌతిక శాస్త్ర పరిశోధనల్లో నర్సాపూర్ ఆర్డీవో పసుపులేటి రామకృష్ణ అంతర్జాతీయ స్థాయి ఘనత సాధించారు. ఆయన ఆవిష్కరించిన "కేఆర్ డిఫెక్ట్ ఫ్రేమ్‌వర్క్" నమూనాకు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రీయ జర్నల్ 'స్ప్రింగర్ నేచర్'లో చోటు లభించింది.

​జెన్సెన్ సూత్రానికి సరికొత్త రూపు:

1906లో డానిష్ గణిత శాస్త్రజ్ఞుడు జోహాన్ జెన్సెన్ ప్రతిపాదించిన 'జెన్సెన్స్ ఇనీక్వాలిటీ' సూత్రాన్ని ఆర్డీవో రామకృష్ణ సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. వ్యవస్థలోని కే (స్కేలింగ్), ఆర్ (రెసిడ్యువల్) అంశాలను అనుసంధానించడం ద్వారా సాంప్రదాయ లోపాలను సవరించారు. సాధారణంగా లభించని సరిహద్దు విలువలను మరియు వక్రతను ఈ కొత్త పద్ధతిలో కచ్చితంగా అంచనా వేయవచ్చు. దీనివల్ల వంతెనలు, ఇతర నిర్మాణాల వద్ద బీమ్స్ వంగుటను ప్రామాణికంగా లెక్కించడం సులభమవుతుంది. ​అంతేకాకుండా, ఈ పరిశోధనలో భాగంగా గోళంపై హార్మోనిక్ విభజన, టేలర్ శ్రేణి సరి-బేసి విభజన మరియు శబ్ద ప్రభావ లెక్కలను కూడా ఈ సూత్రం ద్వారా విజయవంతంగా అనుసంధానించి పరిష్కరించారు.

​పరిశోధనలోని ముఖ్యాంశాలు:

​మెరుగైన ఎంఆర్‌ఐ, ఈసిజి స్కాన్లు:

ప్రస్తుతం వైద్యరంగంలో వాడుతున్న 'గోస్ట్ సెల్' పద్ధతికి కేఆర్ పద్ధతిని జోడించడం ద్వారా ఎంఆర్‌ఐ స్కాన్లలో శబ్దాలు (నాయిస్) తగ్గి స్పష్టత పెరుగుతుంది. బ్రెయిన్ స్కాన్లలో 32-33 శాతం, లివర్ స్కాన్లలో గణనీయమైన స్పష్టత వస్తుంది. ఈసిజి పరికరాలలో 'కే-గ్యాప్' ద్వారా రోగికి సరిపోయే సూచికలను మిల్లీసెకన్లలో గుర్తించవచ్చు.

​సిగ్నల్ వ్యవస్థల్లో నాణ్యత:

 వైఫై 6, 7 వంటి ఆధునిక పరికరాలలో దూర ప్రాంతాలకు సిగ్నల్స్ ప్రసారమయ్యేటప్పుడు డేటా నష్టం జరగకుండా, స్పష్టమైన డేటా పునరుద్ధరణకు ఇది దోహదపడుతుంది. ​ఇతర రంగాలు: క్వాంటమ్ కంప్యూటింగ్, విద్యుత్ ప్రసార వ్యవస్థల్లో లోపాలను సవరించడంలోనూ, భవిష్యత్తులో సాంకేతిక స్థిరత్వానికి ఈ నమూనా ఎంతగానో ఉపయోగపడనుంది.

​సంఖ్య సిద్ధాంతం (నెంబర్ థియరీ), ప్రైమ్ నంబర్లపై అధ్యయనం చేస్తున్న క్రమంలో ఈ ఆలోచన వచ్చిందని రామకృష్ణ తెలిపారు. ఈ పరిశోధన సమాచారాన్ని 'గిట్‌హబ్'లో అందుబాటులో ఉంచగా, జర్మనీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై మరింత అధ్యయనం చేస్తుండటం విశేషం. సివిల్ సర్వెంట్‌గా ఉంటూనే ఈ స్థాయి పరిశోధనలు చేసిన రామకృష్ణను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.