25 June, 2026 | 1:08 AM

ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వైవిధ్యమైన కథ ఇది

25-06-2026 12:10 AM

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ సారథ్యంలోని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సైకాలజికల్ థ్రిల్లర్ జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. “--నేను కథ విన్నప్పుడు ముందుగా దాని నిజాయితీని చూస్తా. కథలో కొత్తదనం ఉంటే తప్పకుండా చేస్తా. దర్శకుడిని, కథను నమ్మి సినిమాలు చేయడానికి ఇష్టపడతా. ‘-రావు బహదూర్’ కథను మొదట నమ్రత విన్నారు. తర్వాత దర్శకుడు వెంకటేశ్ మహా నాకు కథ చెప్పారు. అలా ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. ఇది హై బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొత్తదనంతో రూపొందించాం. -మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని సమర్పించడం వల్ల ‘రావు బహదూర్’ అనే పేరుకే ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చింది.

ఆయన పేరు ఉండటం వల్ల ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతోంది. ఆయన పేరు ఉండటం వల్లే సినిమాకు మరింత మంచి ఇమేజ్ వచ్చి రిలీజ్‌కు ముందే ఓటీటీ, ఓవర్సీస్ బిజినెస్ పూర్తయింది. -మహేశ్‌బాబు ఈ సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని చెప్పడం మాకు మరింత నమ్మకాన్నిచ్చింది. ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా సినిమా చేయడం చాలా కష్టం. ఒక జానర్ హిట్ అయిందని అదే తరహాలో మరో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరించడం లేదు. ఈ -కథ, సెట్స్, కాస్ట్యూమ్స్, నిర్మాణ విలువలు చూస్తే బాహుబలి తరహా భారీ నిర్మాణ అనుభూతి కలుగుతుంది. మేము చెప్పాలనుకుంటున్నదీ అదే.

నిర్మాణ పరంగా ఆ స్థాయి నాణ్యతతో ఈ చిత్రాన్ని రూపొందించాం. రావు బహదూర్ పాత్రకు సత్యదేవ్ పర్ఫెక్టుగా సరిపోయారు. ఆయన ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవారు. అది చిన్న విషయం కాదు. 90 రోజులకుపైగా షూటింగ్ జరిగింది. -రాజుల కాలం నాటి పాత్రకు దీపా థామస్ అద్భుతంగా సరిపోయారు. సినిమాలో కనిపించే రాజభవనాలు, సెట్స్ -అన్నీ ఒరిజినల్ లొకేషన్లలోనే చిత్రీకరించాం. ఒడిశాలో ఒక కోటను ఎంపిక చేసుకున్నాం.

అక్కడ షూటింగ్ జరగడం ఇదే తొలిసారి. కథకు తగ్గట్టు ఆ కోటలో కొన్ని మార్పులు చేసి, ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించాం. సినిమాలో కనిపించే కాస్ట్యూమ్స్ ఒరిజినల్స్. నేను నిర్మిస్తున్న సినిమాల్లో ఒకటి -వినాయక చవితికి, దసరాకు మరో సినిమా రానున్నాయి. త్వరలో వాటి వివరాలను ప్రకటిస్తాం” అని తెలిపారు.