స్థలం ఇచ్చారు.. నిర్మాణమే మరిచారు!
- గురుకుల విద్యాలయ భవన నిర్మాణ మెప్పుడో...
- భవన నిర్మాణం కోసం కాసర్లపహాడ్‌లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయింపు
- ఆక్రమణకు గురవుతున్న భూమి
- పేరుకే జాజిరెడ్డిగూడెం.. నడిచేది సూర్యాపేటలో..
- మండలంలో గురుకుల పాఠశాలకు సొంత భవనం కరువు
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి10: గత 10 సంవత్సరాల కిందట జాజిరెడ్డిగూడెం మండలానికి మంజూరైన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు లేక అప్పట్లో మండల కేంద్రం అర్వపల్లిలో అద్దె భవనంలో నడిపించారు.
కొంతకాలం తర్వా త జాజిరెడ్డిగూడెంలో నిరుపయోగంగా ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చారు. ఇక్కడ విద్యార్థినిల సంఖ్యకు అనుగుణంగా గదులు చాలడం లేదనే కారణంతో సూర్యాపేట మండలం బాలెంల సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాల భవనంలోకి మార్చారు.అప్పటినుండి నేటి వరకు బాలెంల లోని ఈ అద్దె భవనంలోనే విద్యాలయాన్ని నడిపిస్తున్నారు.
7 ఎకరాల స్థలం కేటాయించినా...
సొంత భవన నిర్మాణం కోసం మండలంలోని కాసర్లపహాడ్ గ్రామంలో 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఎస్సీ గురుకుల విద్యాలయానికి కేటాయించారు.అంతేకాకుండా ఇట్టి స్థలంలో సొంత భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.35 కోట్లు కూడా మంజూరయ్యాయి.అయితే వివిధ కారణాలతో టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు.చివరకు వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళాయి .
ఏళ్లు గడుస్తున్నా నిర్మాణానికి నోచుకోని భవనం..
ఎస్సీ గురుకుల విద్యాలయానికి కాసర్లపహాడ్ గ్రామంలో స్థల సేకరణ చేసి 10సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు భవన నిర్మాణం జరగలేదు.ఈ ప్రాంత విద్యార్థినీలు ఉన్నత చదువుల కోసం 40నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం సూర్యాపేటకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.కాసర్లపహాడ్ గ్రామంలో సొంత భవన నిర్మాణం కోసం అప్పటి సీఎస్ శాంతకుమారి,
రాష్ట్ర మంత్రులు,ఆ శాఖల రాష్ట్ర కార్యదర్శులకు పలుమార్లు వినతి పత్రాలు కూడా అందజేశారు.కాగా గ్రామంలో విద్యాలయానికి కేటాయించిన స్థలం ఆక్రమణ లకు గురవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి కాసర్లపహాడ్ గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో గురుకుల పాఠశాల,కళాశాలల భవన నిర్మాణం చేపట్టాలని తల్లిదండ్రులు,పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
సొంత భవనం నిర్మించాలి
కాసర్లపహాడ్ గ్రామంలోని ప్రభుత్వ స్థలం 7ఎకరాల్లో వెంటనే గురుకుల పాఠశాల,కళాశాలల నిర్మాణం కోసం నిధులు మంజూరి చేసి భవనం నిర్మించాలి.ఈ ప్రాంత విద్యార్థినిలు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి సొంత భవనం నిర్మించి,ఇక్కడే పాఠశాల,కళాశాలలను నడిపించాలి.
మచ్చ నర్సయ్య (ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)




