11 March, 2026 | 4:55 AM

హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి!

11-03-2026 12:00 AM
  1. కేబుల్ వైర్‌తో చితకబాదిన లెక్చరర్
  2. రత్నపురి ఇంజినీరింగ్ కళాశాలలో ఘటన

సంగారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని తుర్కల్ ఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇంజినీరింగ్ కళాశాలలో 15 మంది విద్యార్థులపై లెక్చరర్ విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన మంగళవారం కలకలం రేపింది. సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు హోంవర్క్ చేయలేదనే కారణంతో లెక్చరర్ శోవరెడ్డి విద్యార్థులను కేబుల్ వైర్‌తో తీవ్రంగా కొట్టినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు.

తరగతి గది తలుపులు మూసి, విద్యార్థులను బయటకు వెళ్లనివ్వకుండా కొట్టినట్లు విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనలో సాత్విక్, సందీప్, వినయ్, మహేష్, రామ్, సాయి కిరణ్, నవదీప్ తదితర విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు ఫోన్ చేసి సంబంధిత లెక్చరర్‌ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. మీకు నచ్చినట్టు చేసుకోండి అంటూ తల్లిదండ్రులను బెదిరించినట్లు చెప్పారు.