28 July, 2026 | 12:56 AM

ఆర్వోబీపై కేంద్ర మంత్రి బండి ఫోకస్

28-07-2026 12:00 AM
  1. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి వద్ద నిర్మాణం 
  2. పనులు తనిఖీ చేసిన కలెక్టర్ చిత్ర మిశ్రా

కరీంనగర్, జూలై 27 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్  నిర్మాణం పట్టణంలోని ప్రధాన సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ కార్యక్రమం కింద చేపట్టబడింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ 18 వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.154 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఈ పనులు చాలా కాలంగా నత్తనడకన సాగుతుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేజూలపడిన ప్రతిసారీ కరీంనగర్- హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. నిర్మాణ ప్రాంతంలో గుంతలు, విపరీతమైన దుమ్ము కారణంగా ఇటు కాలనీల నివాసితులు, అటు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. 

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోకస్

ఆర్‌ఓబి నిర్మాణంలో మరింత వేగాన్ని పెంచే విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రతిరోజు కరీంనగర్ చొప్పదండి మార్గంలో ప్రయాణికులు పడుతున్న వెతలను తీర్చేందుకు అక్కడ చేపట్టాల్సిన పనులను సత్వరం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రతోపాటు ఆర్ అండ్ బి, రైల్వే అధికారులను కోరారు. సర్వీస్ రోడ్లు, భూసేకరణతో పాటు అనుబంధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పనుల్లో ఎలాంటి జాప్యం జరగొద్దని ఇదివరకే గుత్తేదారు, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సేతు బంధు పథకం కింద రూ.154 కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయించినా.. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పట్టాల్సిన భూసేకరణలో ఆలస్యం జరిగింది. వంతెనకు ఇరువైపులా నిర్మించాల్సిన సర్వీసు రోడ్ల విషయంలోనూ, డ్రెయినేజీ పరంగా ఆలస్యం అవుతుండటంతో మూడు నెలల కిందట ప్రత్యేకంగా సర్వీస్ రోడ్డుకు కేంద్ర మంత్రి నిధులను కేటాయించారు.

అయితే ఈ వర్షాకాలంలోపు పనులు పూర్తవ్వలని గత సమీక్షలో ఆదేశించినా జాప్యం జరిగింది. దీంతో ఈ వానాకాలంలో మరింత ఇబ్బంది ఏర్పడుతుందని స్థానిక తీగలగుట్టపల్లి ప్రజలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి దృష్టికి తేవడంతో అక్కడి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ని కోరారు.

సోమవారం కలెక్టర్ చిత్ర మిశ్రా నిర్మాణ పురోగతిని గమనించారు.  పనులు వేగంగా సాగేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.