పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
మఠంపల్లి,(విజయక్రాంతి): సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దని మఠంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ అన్నారు. మంగళవారం పెదవీడు గ్రామంలోని దళితవాడలో పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుల వివక్ష,అంటరాని తనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాల వారు వర్గ భేదాలు లేకుండా సోదర భావంతో ఐక్యంగా మెలుగుతూ జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీల రక్షణకు భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండి దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు.పోలీసులు మాట్లాడుతూ పౌర హక్కులను భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం అధికారులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.






