1,763 రాజీపడదగిన కేసులు
లోక్ అదాలత్ లో పరిష్కారానికి నోటీసులు జారీ
సిద్దిపేట క్రైం, ఆగస్టు 29 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోర్టు పరిధిలో 1,763 రాజీపడదగిన కేసులను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు నోటీసులు పంపినట్టు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ తెలిపారు. వచ్చే నెల 12న సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు పరిష్కారమైతే, పాత ఫీజు తిరిగి వస్తుందని తెలిపారు.
లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పుపై ఏ ఇతర కోర్టులోనూ అప్పీల్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఇరువర్గాల అంగీకారంతో చెక్ బౌన్స్, సివిల్, రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసులు పరిస్కరించుకోవచ్చని సూచించారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.సౌజన్య, ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్ పాల్గొన్నారు.






