కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఫుల్.. డాక్టర్లు కనీళ్లు!
కొల్లాపూర్ రూరల్ , ఆగస్టు 29(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులు భారీగా చేరడంతో ఆసుపత్రి ప్రాంగణం కిటకిటలాడింది. వైద్యుల కోసం రోగులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగులకు వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
కొల్లాపూర్ తో పాటు పరిసర మండలాలు, గ్రామాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, అందుకు అనుగుణంగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపించారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను నియమించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.






