13 June, 2026 | 2:59 AM

యువత ఉన్నత లక్ష్యసాధనకు కృషి చేయాలి

13-06-2026 01:55 AM

ఎస్పీ నరసింహ

చివ్వెంల, జూన్ 12: యువత డ్రగ్స్ గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని దురాజుపల్లి గ్రామ సమీపంలోని ప్రతిష్ట ఫార్మసీ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి స్నేహితులు, మంచి పుస్తకాలను ఎంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. డ్రగ్స్ కారణంగా యువత ఆరోగ్యం, కుటుంబాలు, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు.

జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి విక్రయాల సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలపై కూడా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని, వ్యసనాలకు బానిసలైన వారిలో పరివర్తన తీసుకురావడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, చివ్వెంల ఎస్‌ఐ మహేష్, బరోసా ఎస్‌ఐ మౌనిక, షీ టీం ఎస్‌ఐ నీలిమ, పోలీసు సిబ్బంది, కళాశాల యాజమాన్యం డా. రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.