యువత రాజకీయాల్లోకి రావాలి
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పిలుపు
శేరిలింగంపల్లి, జూలై 12 (విజయక్రాంతి): దేశంలో చట్టసభల నుంచి క్షేత్రస్థాయి వరకు యువత రాజకీయ భాగస్వామ్యం మరింత పెరగాలని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇండియన్ పాలిటిక్స్ రీడిఫైన్డ్ అనే సమావేశంలో రాఘవ్ చద్దా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశమని, జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు ఉన్నా,
పార్లమెంట్ సభ్యుల సగటు వయస్సు 60 ఏళ్లుగా ఉండటం ఆందోళనకరమన్నారు. కృత్రిమమేధ యుగంలో భారత్ వెనుకబడకూడదన్నారు. ఏఐలో సృజనాత్మక ఉత్పత్తులు తయారు చేసే దేశంగా భారత్ ఎదగాలని, యువత రాజకీయాల్లోకి ముందుకు రావాలని సూచించారు. వైఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చైర్‌పర్సన్ ఖుష్బూ దాగా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో 450 మందికి పైగా మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.






