13 July, 2026 | 3:29 AM

తెలంగాణ అక్షర సిరి అందె శ్రీ

13-07-2026 02:37 AM

జయహే తెలంగాణ జననీ జయకేతనం 

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు.. 

ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ.. జైజై తెలంగాణ !!

జై తెలంగాణ.. జైజై తెలంగాణ !!

‘కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితె అమ్మరాఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురాజాతి గుండెలో జీవ నదముల జాలువారే జానపదములగ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరోయిట’‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడునూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ వున్నాడో కాయాన్ని కంటికి కానరాడు’&  అంటూ అందెశ్రీ కలం విప్పినా, గొంతు విప్పినా కవిత్వం నదిలా పారుతుంది.

మేఘమాలై పరుగులు తీస్తుంది. చిరుగాలై వీస్తుంది.ఆకాశంలోకి పక్షులు తుర్రు న ఎగిరినంత సులువుగా ఆయన నోటి నుంచి ఆశు కవిత్వం పాటలా పరుగులు పెడుతుంది. బడిలో అక్షరం ముక్క చదువుకోకపోయినా, ప్రకృతి ఒడిలోనే అక్షరాభ్యాసం చేసి లోకమనే మహా విశ్వవిద్యాలయంలో అనుభవ పాఠాలు నేర్చాడు. లోక కవిగా కవిగా ఎదిగాడు. తెలంగాణకు రాష్ట్ర గీతాన్నిచ్చే వాగ్గేయకారుడ య్యాడు. సమాజాన్ని, చుట్టూ ఉన్న ప్రకృతిని ఆయన చదివినంతగా మరెవ్వరూ చదవలేదేమో అనిపిస్తుంది.

పసితనం నుంచే ఆలమం దలు, గొర్రె మందలను కాస్తూ, వాటినే తన తొలి స్నేహితులుగా చేసుకుని చిట్టడవుల్లో, చేల గట్లపై పద్యగానం చేసిన అపురూప అనుభవం ఆయనది. కాపరిగా గొంతుకెత్తిన ఆ శబ్దమే, తర్వాతి కాలంలో ఒక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, కోట్లాది మంది గుండెలను రగిల్చి న పోరుపాటగా మారింది. అందెశ్రీ 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించాడు. అస లు పేరు అందె ఎల్లయ్య.

ఊహ తెలియని చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కాగా, అనాథగా మారాడు. ఆయన బాల్యం తీవ్రమైన ఆటుపోట్లతో, ఆకలి బాధలతో గడిచింది. పొట్టకూటి కోసం పశుల కాపరిగా, రోజువారీ కూలీ గా, తాపీ మేస్త్రీగా కనపడ్డ ప్రతి పని చేశాడు. 1978 ప్రాంతంలో బతుకుదెరువు కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్లాడు. ఆర్మూర్, నందిపేట్, మచ్చర్ల, సిద్దాపూర్, వన్నెల్(కె), ఖుద్వాన్పూర్, నందిపేట్, లక్కంపల్లి, తల్వెద గ్రామాల్లో కల్వర్టు పనులకు కూలీగా పని చేశాడు.

తన కవితలు, రచనలను బాసర జ్ఞాన సరస్వతి పాదాల చెంత పెట్టిన తర్వాతే, వాటిని పుస్తకాలు ముద్రించడం అందెశ్రీ సెంటిమెంట్. ఏటా నాలుగై దుసార్లు ఆయన బాసర వెళ్తారు. అక్కడి సరస్వతి మాతను దర్శించుకునేవాడు. ౨౦౦౨లో రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని సరస్వతి అమ్మవారికి అంకితమిచ్చాడు. 

యక్షగానం.. వీధి నాటకాలకు ఆకర్షితుడై

జీవితంలోని దుఃఖాన్ని దిగమింగుతున్న సమయంలోనే ఆయన్ను వీధి బాగోతాలు ఆకర్షించాయి. యక్షగానాలు, కోలాటాలు ఆకట్టు కున్నాయి. ఈక్రమంలోనే ఆయన ఆశుకవిగా రూపాంతరం చెందాడు. పొలం పనులు చేసుకుంటూ అందెశ్రీ అలవోకగా పాటలు అల్లేవా డు. అంతేకాదు.. అపురూపంగా గానం చేసేవాడు. అందెశ్రీ పాటలను విని శృంగేరి మఠా నికి చెందిన స్వామిశంకర్ మహరాజ్  చేరదీశారు. అందె ఎల్లయ్య అనే పేరును మార్చి ‘అందెశ్రీ’గా నామకరణం చేశారు. 

మహారాజ్ తో బంధం అందెశ్రీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. లోకజ్ఞానంతో ఆయన రాసిన గేయాలు ప్రజా హృదయాలను హత్తుకున్నా యి.  ఆచార్య బిరుదురాజు రామరాజు మార్గదర్శకత్వంలో అందెశ్రీ తన సాహిత్య సృజనకు పదునుపెట్టాడు. ఈక్రమంలోనే ఆయనకు నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో అందెశ్రీ పాటలు రాశాడు. ఆ సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటల పాత్ర కూడా ఉంది.

ముఖ్యంగా ‘ఎర్ర సముద్రం’ చిత్రం కోసం అందెశ్రీ రాసిన ‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు’ అనే పాట సమా జంలోని కుల వ్యవస్థను, దిగజారుతున్న మాన వ సంబంధాలను ఘాటుగా ప్రశ్నిస్తూ ప్రజల హృదయాల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఏ బడికీ వెళ్లని ఒక కవి రాసిన ఈ సినిమా పాట, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు సిలబస్‌లో పాఠ్యాంశంగా చేరిందంటే ఆయన సాహిత్యానికి ఎంత పదునుందో అర్థం చేసుకోవచ్చు. ‘గంగ’ సినిమాకు రాసిన ‘వెళ్లిపోతు న్నావా తల్లి’ పాటకు గానూ ఆయన ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 

నదీ నదాలపై మక్కువ

అందెశ్రీకి ప్రకృతి అన్నా, నదీనదాలన్నా ప్రాణప్రదమైన మక్కువ. ఈ భూగోళంపై ప్రవహించే నదుల వెంట ప్రయాణించాలనేది ఆయన జీవితకాల ఆకాంక్ష. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన అరుదైన సంచారి ఆయన. ‘నది నడిచి పోతున్నది.. నావనై నను రమ్మన్నది’ అంటూ అనేక దేశాల్లోని నదులను సందర్శించి పరవశించిపో యాడు ఈ వాగ్గేయకారుడు. తన అనుభవాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఒక బృహత్ నదీకావ్యం రాయాలని ఆయన కలలుగన్నాడు.

ఆ కల నెరవేరలేదు. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్ని ర్మాణంలో భాగంగా 1,307 పేజీల బృహత్ సంకలనం ‘నిప్పుల వాగు’ను అందించాడు. ఆయన ప్రతిభను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించగా, దాశరథి పురస్కారం, రావూరి భరద్వాజ పురస్కారం వంటి ఎన్నో గౌరవాలు ఆయన్ను వరించాయి. అందెశ్రీ ప్రస్థానంలో అన్నింటికంటే మకుటాయమానమైనది ‘జయ జయహే తెలంగాణ’ గీతం.

మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను, అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన రాసిన ఈ పాట ప్రతి సభలోనూ మార్చ్‌ఫాస్ట్ గీతంగా గుండెలను ఉప్పొంగించింది. ఒకానొక దశలో నిరాదరణకు గురైనప్పటికీ, తన చివరి రోజుల్లో ఈ గీతానికి అత్యున్నత గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పాటను అధికారిక ‘రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. ఈ అరుదైన ప్రజాకవి 2025 నవంబర్ 10న కన్నుమూశాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాటలు తెలంగాణ నేలపై ఎప్పటికీ అజరామరం.