పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లిలో నూతన రేషన్ షాపు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును శనివారం స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి, వారికి ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక
అనంతరం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులో శ్రీ కల్యాణమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస బోనాల మహోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. బోనాల పండుగను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందించడంతో పాటు తగిన గుర్తింపు కల్పిస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని విజయరమణ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






