కమనీయం సీతారాముల కల్యాణం
సనత్నగర్, మార్చి 27 (విజయక్రాంతి):- శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పల్లకిని మోశారు. సనత్ నగర్ లోని 7 టెంపుల్స్ లో స్వామి వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలను సమర్పించారు.
పద్మారావు నగర్, బన్సీలాల్ పేట పోల్ బాల్ హనుమాన్ టెంపుల్, ముషీరాబాద్ సర్కిల్ లోని శ్రీ సీతా రామాంజనేయ ఆలయంలను దర్శించుకుని శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లకిని మోస్తూ మండపం వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. క్లాస్, మెట్ల బావి వద్ద గల ఎర్ర పోచమ్మ దేవాలయం, అరుణ్ జ్యోతి కాలనీలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలలో నిర్వహించిన కళ్యాణం, ఎమ్మెల్యే వెంట లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.
జై భారతీ స్కూల్ సమీపంలో..
జై భారతీ హై స్కూల్ సమీపంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జై భారతీ స్కూల్ చైర్మన్ విష్ణు మరియు స్నేహ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, ప్రముఖులు హాజరై భక్తి పరవశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, ఆకుల మహేష్, అశ్విని, నవీన్, కుషాల్, రమేష్, ఆనంద్ మరియు నారాయణన్ రాజ్ దంపతులు తధితరులు పాల్గొన్నారు.
మేడిపల్లిలో..
మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శుక్రవారం మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగగా, మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
అనంతరం మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ప్రభు,జావీద్ ఖాన్, యాసారం శ్రీనివాస్, ఆకుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
సనత్నగర్..
సనత్నగర్:- లోక కల్యాణం కోసం ఎన్నోత్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ హనుమాన్ దేవస్థానంలో, సనత్ నగర్ డివిజన్ సెవెన్ టెంపుల్స్, జెక్ కాలనీలో సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా ఆలయాల ఈవోలు, పురోహితులు, అర్చక సిబ్బంది, నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కుషాయిగూడలో..
కుషాయిగూడ: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పద్మశాలి టౌన్‌షిప్ గ్రూప్ ఆఫ్ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ట్రస్ట్ చైర్మన్ సీత ఆంజనేయులు దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, అతినగరం సుదేష్, అవర్ రామకృష్ణ, ఫ్రీడమ్ సుదర్శన్, గుర్రం విశ్వేశ్వర్, కన్నాడి నాగభూషణం, నారా జనార్ధన్, కె. నరసింహ, దొంత శ్రీనివాసులు, మహేశ్వరం విజయకుమార్, పాలాది శ్రీనివాస్, చక్రపాణి, వేముల దీప, పినవనీత, బింగి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.




