ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) ఆకస్మికంగా పరిశీలించారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారు చిట్టెమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై లబ్ధిదారుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించి, నిజమైన అర్హులైన నిరుపేద కుటుంబాలకే ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్మాణాల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమా, సంబంధిత శాఖల అధికారులు, మండల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






