30 August, 2026 | 2:04 AM

అంతరించిపోతున్న ఒగ్గు కథ

30-08-2026 01:09 AM

నెరవేరని మిద్దె రాములు కోరిక 

ఒగ్గు కథ తెలంగాణ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధ జానపద కళారూపం. ఆధునిక జీవనశైలి, ప్రత్యామ్నాయ వినోదాల కారణంగా ఈ అద్భుతమైన కళ క్రమంగా అంతరించిపోతోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరిచిన ఈ కళను సజీవంగా ఉంచే ప్రయత్నం పాలకులు చేయడం లేదు.

ఒగ్గు కథను ప్రపంచానికి చాటిన వేములవాడ మండలం హన్మాజీ పేటకు చెందిన మిద్దె రాములు బడికి వెళ్లలేదు. ఒగ్గు కథను సజీవంగా ఉంచడానికి బడి పెట్టాలనుకున్నాడు కానీ కోరిక నెరవేరకుండానే చనిపోయాడు. ఆయన ఈ సంప్రదాయాన్ని పోనియ్య.. తరతరాలకు నిల్సేట్లుగ జేస్త... తెలంగాణచ్చినంక ఒగ్గుకథకు బడివెడ్తా... కొత్త పిలగాండ్లకు నేర్పిస్త... అని కలలు కన్న తెలంగాణ గొంతుక.

తెలంగాణ రాకనుందే ఉద్యమం నడుస్తున్న 2010లో కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన సమయంలో రాములు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్‌తో తెలంగాణలో ఒగ్గు బడి పెట్టాలన్న తన మనసులో మాటను చెప్పాడు. అయితే ఒగ్గుకథ పాఠాలు నేర్పే బడి తెరవాలన్న ఆయన కల సాకరమవలేదు. తాను తలపోసిన ఆకాంక్ష నెరవేరకుండానే అనారోగ్యం ఆయన్ను బలిగొంది. 25 నవంబర్ 2010న ఆయన నిష్క్రమిం చారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ చరిత్ర పుటల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. 

ఒగ్గు కథ విశేషాలు..

ఇది ప్రధానంగా యాదవ (గొల్ల), కురుమ సమాజాల నుంచి పుట్టింది. శివుని రూపమైన మల్లికార్జున (మల్లన్న), బీరప్ప, ఎల్లమ్మ దేవతల చరిత్రలను ఈ కళాకారులు గానం చేస్తారు. ఒగ్గు డోలు వాయిద్యం మోగిస్తూ, గజ్జెలు కట్టి పదం పాడుతూ, అడుగులో అడుగు కలుపుతూ చేసే నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. వందల ఏళ్ల సంస్కృతిని, తెలంగాణ ఆత్మను ఈ ఒగ్గు కథ తరతరాలుగా మోసుకెళ్తోంది.

ఆధునిక సినిమా, టెలివిజన్ డిజిటల్ వినోదం పెరగడం, కళాకారులకు తగిన ఆర్థిక ప్రోత్సాహం, జీవనోపాధి కరవు కావడం, యువత ఈ పారంపర్య కళను నేర్చుకోవడానికి ముందుకు రాకపోవడం ఆదరణ కోల్పోవడానికి ప్రధాన కారణాలు. అయితే ఈ సంస్కృ తిని కాపాడుకోవడానికి కొద్దిమంది యువకులు ఒగ్గుడోలు విన్యాసాలతో ఆధునికతను జోడిస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరిని ప్రోత్సహించాలిసిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

ఒగ్గు కథ పితామహుడు మిద్దె రాములు

నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలిన మిద్దె రాములు 1941లో రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రముఖ కవి సినారె స్వగ్రా మం హన్మాజీపేట లో జన్మించారు. అక్షర జ్ఞానం లేకున్నా కళలవైపు ఆకర్షితుడై ఒగ్గు కథలో రాణించి.. గ్రామీణ ఒగ్గు కథకు అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెట్టాడు. ఆశు కవిగా తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయిన మిద్దె రాములు వందలాది ప్రదర్శనలు ఇచ్చి ఒగ్గుకథ పితామహుడిగా పేరుగడించాడు. చిన్ననాటి నుంచే ఒగ్గు కథపై మమకారం పెంచుకొని స్వయం కృషితో ఆ ప్రక్రియను ఆకళింపు చేసుకుని ప్రదర్శనలిచ్చేవాడు. సామాన్య గీత కార్మిక కుటుంబంలో పుట్టిన మిద్దె రాములు దేశవ్యాప్తంగా ప్రదర్శనలివ్వడమేకాక విదేశాల్లో కూడా తన ప్రతిభను చాటారు.

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన 1990లో మారిషస్‌లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభలో ఆ దేశ అప్పటి ప్రధాని అనురుధ్ జగన్నాథ్ ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమంగా సాగిన ధూంధాం ప్రధాన భూమికను పోషించిన విషయం తెలిసిందే. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు దోహద పడిన అనేక రూపాలను ప్రదర్శించిన ఆ వేదిక మిద్దె రాములు బోనం ప్రదర్శనకు పబ్బతి పట్టింది. ప్రముఖ కవి సినారె కూడా మిద్దె రాములును ప్రోత్సహించారు.

ఆయన ప్రతిభకు కళాపురస్కార్ అవార్డు అందుకున్నారు. ఆయన రేణుకా ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, గంగాగౌరి, బాలనగమ్మతో పాటు అనేక  పౌరాణిక కథలను చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన  కథలలోని పాత్రలన్నింటినీ తనదైన శైలితో మంత్రముగ్ధులైన ప్రేక్షకుల కళ్ల ముందు ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర సాంస్కృతిక మండలిలో సభ్యుడిగా సేవలందించారు.

 బల్మూరి విజయసింహారావు, విజయక్రాంతి, కరీంనగర్