గడువు పెంచండి
‘సర్’ ప్రక్రియలో విధానపరమైన లోపాలు
- రాష్ట్రంలో మూడో వంతు ఓటర్లపై ప్రభావం
- అర్హులైన ఏ ఒక్కరి ఓటూ పోవద్దు సవరణకు తగినంత సమయం ఉంది
- లోపాలను సరిదిద్దాలి
- ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే ఈ ప్రక్రియలో విధానపరమైన లోపాలు ఉన్నాయని,
వాటిని సరిదిద్దాలని పేర్కొన్నారు. అందుకు ఓటర్లకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌కు శనివారం లేఖ రాశారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా, అలాగే అనర్హులు జాబితాలో చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
2026 జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7 శాతం) గైర్హాజరైన, నివాసం మారి న, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా గుర్తించారని పేర్కొన్నారు.
వీరిలో దాదాపు 62 శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారినట్టుగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం చేయలేదని తెలిపారు.
దీంతో సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చే యాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని వివరించారు. ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని.. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు.
నిజంగా నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం- ద్వారా ఎలాంటి సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా నివాసం మారిన వారి పేర్ల ను తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను పాటించడం లేదని తెలిపారు.
దీనివల్ల ఓటర్లు పోలింగ్ రోజున కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కు తొలగిపోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. హైదరాబాద్, మే డ్చల్- రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన,
మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం, పరిశీలన నోటీ సుల్లో 41.9 శాతం కేంద్రీకృతమై ఉన్నాయ ని తెలిపారు. ఉద్యోగాలు, వివాహాలు, తా త్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవ రణ ప్రక్రియను మరింత సులభతరం చే యాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పట్లో ఎన్నికల్లేవు.. జాబితా సవరించాలి
సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువు సెప్టెంబర్ 16 వరకు మాత్రమే ఉందని, కూలీలు, వలస కార్మికులు,
వయోవృద్ధులు తమ పత్రాలను సమర్పించేందుకు సమయం సరిపోదని లేఖలో పేర్కొన్నారు. కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. అవసరమైతే సహాయ కేంద్రా లు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని పొందేందుకు సహకరించాలని సూచించారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబి తాను సవరించి విస్తరించాలని సూచించారు.
అలాగే తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అక్టోబర్ 19 నుంచి సవరించాలని కోరారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాలను బహిరంగంగా చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు.






