నందివనపర్తిలో కళ్యాణీ చాళుక్యల శాసనం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణీ చాళుక్యుల శాసనం వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో పడివున్న స్తంభాన్ని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రొఫెసర్ డా. సి.వి. పవన్‌కుమార్.. ఇది కళ్యాణీ చాళుక్యుల శాసనమని గుర్తించారు.
అనంతరం కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ స్తంభాన్ని మరోవైపు తిప్పి పరిశీలించారు. శాసనంలో ఇంతకాలం కనిపించని భాగాన్ని గుర్తించడంతో పాటు లిపి పఠనంలో సహకరించారు.
దీంతో శాసనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ శాసనం మొదటి వైపు తెలుగుకన్నడ లిపిలో, కన్నడ భాషలో చెక్కబడి ఉంది. శాసనానికి రెండు వైపులా మొత్తం 35 పంక్తులు కనిపిస్తున్నాయి. మొదటి వైపున కళ్యాణీ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడి ప్రశస్తి ఉంది. ఆయన నెలవీడు కళ్యాణపురం అని శాసనంలో పేర్కొన్నారు.
శాసనస్తంభం కింది భాగం కొంత విరిగిపోవడంతో కొన్ని పంక్తులు, వివరాలు అసంపూర్ణంగా ఉన్నాయి. శాసనం రెండో వైపున శక సంవత్సరం 998, చైత్ర శుద్ధ 12, శుక్రవారం, అంటే క్రీస్తుశకం 1077 ఏప్రిల్ 7 నాటి వివరాలు నమోదై ఉన్నాయి. త్రిభువనమల్లుని మహామండలేశ్వరుడు ‘మోగత రసర’ ‘ఈంజకేశ్వరునికి’ చేసిన దానం, సమర్పించిన కానుకలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే దానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్న శాసనభాగం కొంత విరిగిపోవడంతో పూర్తిగా చదవడం సాధ్యం కాలేదు.
రాజచిహ్నాలు, మతపరమైన అంశాలు
శాసన ప్రారంభ భాగంలో చంద్రుడు, సూర్యుడు, నంది, శివలింగం, ఆవు కింద ఖడ్గం, ఏనుగుల అర్ధశిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ఆనాటి శాసన సంప్రదాయం, మతపరమైన విశ్వాసాలు, రాజచిహ్నాలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ శాసనం ద్వారా నందివనపర్తి ప్రాంతంలో కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి రాజకీయ, మత, దానధర్మాల చరిత్రకు సంబంధించిన కీలక ఆధారం లభించినట్లయింది. ముఖ్యంగా క్రీస్తుశకం 1077 నాటికే ఈ ప్రాంతంలో చాళుక్యుల పరిపాలనా, మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు శాసనం స్పష్టం చేస్తోంది.
పరిశోధకులకు విద్యార్థుల సహకారం
కళ్యాణీ చాళుక్కుల శాసనాన్ని వెలికితీసి దాని ప్రతిని తయారు చేయడంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు పరిశోధకులకు సహకరించారు. వీరితో జి. శివకుమార్, కె. శివరాణి, నందివనపర్తికి చెందిన శివ, జగన్ తదితరులు ఉన్నారు.
శాసనం మొదటివైపు ఉన్నవి..
1.స్వస్తి సమస్త భువనాశ్రయ
2.శ్రీప్రిథ్వీవల్లభ మహరాజ
3.రాజపరమేశ్వరం పర
4.మభట్టారకం సత్యాశ్రయ
5.కులతిలకం చాళుక్యాభ
6.రణం శ్రీమత్రిభువన
7.మల్ల దేవిర విజయ
8.రాజ్యముత్తరోత్తరా
9.భివ్రిద్ది ప్రవర్ధమాన
10.మాచంద్రార్కరాంబర క
11.ల్యాణద నెలవిడి...
12. .......సమ........సహి
13. ..........ది..పోర....ల
14. ..................రం...
15. ........................
రెండవ వైపు..
1.(సం)గ్రామరామం భూదక్ష...
2. ....గళం చాళుక్య కుల
3.చంద్రం బోగామారేంద్ర
4.త్యవిఖ్యాతం భూప ప్ర
5.(ణ)తం క్షత్రియపవి
6.త్రం సమర..........
7.గణసిఖామణి వివే
8.క చూడామణి సా
9.హసోత్తుంగ నెయు
10.న సింగం నామాది
11.సమస్త ప్రశస్తి స
12.హిత శ్రీమను
13.మహామండళస్వ
14.రం వగతరసర
15.సక వరిష 998నేయ (పిం)
16.గళ సంవత్సరద చైత్ర
17.12 సుక్రవారము
18.స్వర..0జెకేస....
19.కిసుమ
20.ఱయ






