30 August, 2026 | 3:03 AM

సర్కార్‌పై పోరు

30-08-2026 01:56 AM
  1. కార్యాచరణను సిద్ధం చేసిన బీజేపీ
  2. 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష
  3. 22-ఏ నిబంధనల ఉపసంహరించుకోవాలి
  4. 7న నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై బీజేవైఎం మహాధర్నా
  5. రైతాంగ సమస్యలపై కిసాన్ మోర్చా విస్తృత యాత్ర
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన
  7. సమావేశమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ  భారీ కార్యాచరణ ను సిద్ధం చేసింది. భూభారతి పోర్టల్ లోపాలు, సెక్షన్ 22-ఏ కింద భూములను నిషేధిత జాబి తాలో చేర్చడం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల

వంటి కీలక ప్రజా సమస్యలపై కమలం పార్టీ సమరానికి సన్నద్ధమైంది. ఈ నిరసనల ద్వారా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అధ్యక్షతన పార్టీ ఎంపీలు,

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, రైతుల సమస్యలపై నేతలు చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానా లపై సమగ్రంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్‌రావు మీడియాతో మాట్లా డారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో 22ఏపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి రెండు రోజుల దీక్ష, 7వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేవైఎం మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ యాత్ర త్వరలో నిర్వహి స్తాం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు మండిపడ్డారు.

ప్రజాసమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని, క్షేత్రస్థాయి నుంచి ప్రజా ఉద్యమాలను ఉధృ తం చేసి, రేవంత్‌రెడ్డి సర్కార్ మెడలు వంచుతామని ఆయన స్పష్టం చేశారు.

సమన్వయంతో ముందుకెళ్తాం..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ సమన్వయంతో కార్యాచరణ రూపొందించి, ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం పాలిటె క్నిక్ విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ అంశాలు, రైతుల సంక్షోభంపై దృష్టి సారించామన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులు, రైతుల సమస్యలపై దశలవారీగా చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి  తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను పరిశీలించనున్న ట్టు వివరించారు. చేవెళ్ల నియోజకవర్గంలో 90 శాతానికిపైగా రోడ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.