రైతుల్లో పట్టోత్సాహం
- 8 ఏళ్ల ‘అరణ్య’ రోదనకు తెర!?
- పాసుపుస్తకాల్లో తొలగిపోయిన ‘అడవి’ పేరు
- నారాయణపురంలో 780 మంది రైతులకు భూభారతి ద్వారా లభించిన భూహక్కులు
ఆ ఊరిలో తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు.. భూప్రక్షాళనలో అరణ్యమయ్యాయి. అధికారుల నిరక్ష్యంతో పట్టా కాలంలో రైతు పేరుకు బదులు ‘అడవి’, తండ్రి పేరుకు బదులు ‘అడవి’గా మారి రైతులను అరిగోసలు పెట్టాయి. ‘ధరణి’ ద్వారా పట్టా పాస్ పుస్తకాలు పొందలేక.. దాదాపు 8 ఏళ్లుగా రికార్డుల్లో నుంచి ‘అరణ్యం’ పేరును తొలగించుకోలేక అష్టకష్టాలు పడ్డారు.
తమ సాగు భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతుల ‘అరణ్య’ రోదనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముగింపు పలికింది. పాసుపుస్తకాల్లో ‘అడ వి’ తొలగిపోయి.. నారాయణపురంలో 780 మంది రైతులకు భూభారతి ద్వారా భూహక్కులు లభించా యి. ఇచ్చిన హామీని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిలబెట్టుకోవడంతో బాధిత రైతుల్లో పట్టాల తొలిపొద్దు ఉదయిస్తోంది. రేపు మంత్రుల చేతుల మీదుగా రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
2018లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన సమయంలో అధికారులు ఆ గ్రామాన్ని ‘అడవి’గా పేర్కొనడం వల్ల సుమారు 1,000 మంది రైతులకు చెందిన సు మారు1,800 పైగా ఎకరాల భూములకు ‘ధరణి’లో ఎటువంటి రికార్డు లేదు.దీంతో గత ప్రభుత్వం హయాంలో రైతుబంధు, రైతు బీమా, బ్యాంకు రుణా లు, ఇతర ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు తమగోడు పట్టించుకోవాలంటూ 8 ఏళ్లుగా ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడంతో పాటు అనేక విధాలుగా ఉద్యమాన్ని నిర్వహించారు.
ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని, సీసీఎల్‌ఏ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నారాయణపురం గ్రామ రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు గ్రామంలో ప్రత్యేకంగా భూముల రీ సర్వేకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించారు. అటవీ శాఖ నుంచి సర్వే నిర్వహింపజేసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయించారు.
వివాదం ఏర్పడింది ఇలా..
నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం శివారు గ్రామంగా ఉన్న నారాయణపురం 43 సర్వే నెంబర్లు, 1,827.12 ఎకరాల భూ విస్తీర్ణంతో 800 ఖాతాలతో ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పడింది. అయితే భూ ప్రక్షాళన సమయంలో పాత రికార్డులను ఆధారంగా చేసుకుని, రైతు ల వద్ద పాత రికార్డులు లేకపోవడం వల్ల ‘ధరణి’లో అటవీ భూమిగా పేర్కొనడంతో వి వాదం ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రికార్డులను, ఆన్లైన్ రికార్డులను ఆధారంగా చేసుకుని పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయడం కంటే భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి వాస్తవ హద్దులు, విస్తీర్ణం నిర్ధారించి పాత రికార్డులతో సరిపోల్చి సరైన భూరికార్డులను రూపొందించాల ని ప్రభుత్వం సమగ్ర రీ సర్వే చేపట్టింది. 2026 జనవరి 27న గ్రామసభ నిర్వహించి రీ సర్వేకు గ్రామస్తులు సహకరించాలని అవగాహన కల్పించారు.
పెంటాక్స్ రోవర్ పరికరాలతో కొలతలు
అనంతరం గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్, గ్రామపంచాయతీ, రోడ్లు భవనాలు, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూముల హద్దులను క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి గుర్తించారు. అనంతరం ప్రతి రైతు, అనుభవదారు చూపించిన ప్రకారం.. వారి భూ కమతాలను క్షేత్రస్థాయిలో సర్వే బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంటాక్స్ రోవర్ పరికరాలతో పరిశీలించి కొలతలు తీసుకొని హద్దులు, విస్తీర్ణం వాస్తవ పరిస్థితులను నమోదు చేశారు. నారాయణపురంలో మొత్తం భూముల రీ సర్వే ప్రక్రియను గత జూన్ నెలాఖరుకు పూర్తి చేశారు.
రేపు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ
చివరకు రీ సర్వే ఆధారంగా కొరిలేషన్ స్టేట్మెంట్, ఏరియా కంపారిజన్ స్టేట్మెంట్, పహాని రికార్డుల్లోని డిస్క్రిప్షన్ ఆధారంగా జాబితా, డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ సిద్ధం చేశారు. సెక్షన్ 13 ప్రకారం జిల్లా గెజిట్‌లో సర్వే పూర్తి చేసినట్లు ప్రకటించి కేసముద్రం తహసీల్దార్‌కు రికార్డులు అప్పగించారు. ఈ విధంగా నారాయణపురం గ్రామంలో రీ సర్వే ద్వారా భూముల వాస్తవ హద్దులు, విస్తీర్ణాలు, భూధార్ వివరాలను నిర్ధారించి వాటిని ‘భూభారతి’ రికార్డుల్లో అనుసంధానం చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా, సోమవారం మొదటిసారిగా పట్టా పాస్ పుస్తకాలు అందుకోనున్నారు.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్






