17-02-2026 01:46:41 AM
5 కార్పొరేషన్లు.. 85 మున్సిపాలిటీలు హస్తగతం
కార్పొరేషన్లు 7
కాంగ్రెస్ 5
సీపీఐ 1
బీజేపీ 1
మున్సిపాలిటీలు-105
కాంగ్రెస్ 85
బీఆర్‌ఎస్ 17
బీజేపీ 1
ఇతరులు 2
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టణాల్లో నూ పై చేయి సాధించింది. హోరాహోరీగా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి.. ఎన్నిక ఏదైనా తిరుగులేదని హస్తం పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మొత్తం మీద ఐదు కార్పొరేషన్లు.. 85 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది.
బీఆర్‌ఎస్ 17 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, బీజేపీకి కరీంనగ ర్ కార్పొరేషన్, నారాయణపేట్ మున్సిపాలిటీ, వడ్డేపల్లిలో ఏఐఎఫ్‌బీ, మహబూబాబాద్‌లో ఇండిపెండెంట్ విజయం సాధించాయి. ఇంకా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కార్పొరే టర్స్, కౌన్సిలర్స్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
అనంతరం ఏడు కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. ఇక రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో 11 మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డాయి. దీంతో మిగతా 105 పురపాలికలకు కొత్తగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నికయ్యారు. దీంతో ఏడు కార్పొరేషన్లు, 105 మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గం కొలువు తీరింది. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లలో నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, మహ బూబ్‌నగర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకున్నది.
ఇక కొత్తగూడెం కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక 105 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 85 పట్టణాల్లో విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ 17 పురపాలికల్లో గెలిచింది. బీజేపీ నారాయణపేటలో, వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, మహబూబాబాద్‌లో చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి, వైస్‌చైర్మన్‌గా సీపీఎం అభ్యర్థి విజయం సాధించాయి.
హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా..
హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల బీఆర్‌ఎస్, ఒకటి, రెండు స్థానాల్లో బీజేపీతో జత కట్టిన కాంగ్రె స్.. కొన్ని మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులను చేర్చుకుని చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నది. హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచిన పట్టణాల్లో వర్దన్‌పేట, కామారెడ్డి, అలియాబాద్, నర్సాపూర్, దేవరకద్ర, మోయినాబాద్, వేములవాడ, బోధన్, పరిగి; బీఆర్‌ఎస్ పార్టీ అమరచింత, జమ్మికుంట, ఆమన్‌గల్, జిన్నారం, ఇస్నాపూర్, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో ఇతర పార్టీల మద్దతుతో కొలువుతీరింది. ఇక ఆదిలాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అండగా నిలిచాయి.