27 May, 2026 | 3:24 AM

ప్రజల నమ్మకమే పాలనకు పెన్నిధి

27-05-2026 12:00 AM

యుద్ధంలో పరదేశాలపై గెలవడం లేదా ప్రజాస్వా మ్యంలో ఎన్నికల్లో విజయాన్ని సాధించడం పాలకులకు అగ్ని పరీక్షయే కాని దానికన్నా సాధించిన విజయాన్ని ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారా శాశ్వతం చేసుకోవడ మే నిజమైన సమస్య. శత్రువును ఓడించడం కన్నా, అతని పాలన కన్నా మెరుగైన పాలన అందించినప్పుడే ఉత్తమ పాలకునిగా గుర్తిం పు పొందుతాడు. కాలమేదైనా ప్రజల సాం స్కృతిక అంగీకారం లేని పాలన ఎంత శక్తివంతమైనదైనా ఎక్కువ కాలం నిలవదు.

నవమ వాప్యలంభం 

పరదోషాన్ స్వగుణైః ఛాదయేత్,

గుణాన్ గుణద్వై గుణ్యేన, 

స్వధర్మ కర్మానుగ్రహ పరిహార 

దానమాన కర్మభిశ్చ ప్రవృతి 

ప్రియహితాన్యాను వర్తేత!

(కౌటిలీయం 13

కొత్తగా రాజ్యాన్ని సాధించిన పాలకుడు అంతవరకు ఆ రాజ్యాన్ని పాలించిన శత్రు వు దోషాలను తన గుణాలతో, వాని మం చి గుణాలను వాటి కంటే అధికమైన ఉత్త మ గుణాలతో కప్పివేయాలి. ‘మంచివానిగా’ గుర్తింపుపొందాలి. ప్రజలు ఎవరెవరి ధర్మాలను, కర్మలను అనుసరించడానికి వారిని అనుమతించడం, ఉపాధి కల్పించ డం, గౌరవించడం మొదలైన ప్రక్రియలతో ప్రజలకు ప్రియునిగానూ, హితునిగానూ ప్రవర్తిస్తూ ప్రజలను అనుసరించాలి.

శత్రువునకుద్వేషపాత్రులై తనకు సహాయపడిన వారిని ఆదరించడం, తన విజయానికై శ్రమించిన వారిని గుర్తించి సత్కారాదులచే వారిని ఆనందపరచాలి. ఇచ్చిన హామీలను నిలుపుకోని పాలకులను తనవారూ.. ఇతరులూ విశ్వాసరహితులుగా ఈసడిస్తారు. ప్రజల ఉత్సవాల్లో వారి సంస్కృతికి అనుగుణంగా పాల్గొనడమూ, వేషభాషలనూ, కట్టుబాట్లనూ ఆదరిస్తూ ప్రజలతో మమేకమైన వాడే సాధించిన విజయాన్ని నిలుపు కోగలుగుతాడు, అంటాడు, ఆచార్య చాణక్య.

పరరాజ్యాలపై దండయాత్రలు చేయ డం.. జయించిన రాజ్యాలపై తమ ఆధిపత్యాన్ని చాటుకోవడం సహజమే. మహా భారతంలో పాండవులు రాజసూయ యాగ సందర్భంలో వివిధ దేశాలను జయించినా.. తాము జయించిన ప్రతి రాజ్యంలోనూ ఆ రాజ్యానికి సంబంధించిన వారసులను రాజులుగా ప్రకటించడం వల్ల.. ఆయా రాజ్యాల సంస్కృతిని, ఆచార వ్యవహారాలను ప్రజలు పాటించే అవకాశం ఇచ్చారు. 

రాజకీయ స్థిరత్వం, వ్యూహప్రతివ్యూహాలు, రాజ్యరక్షణ ప్రధాన అంశాలుగా చాణక్యుడు తన అర్థ శాస్త్రాన్ని నిర్మించగా.. ధర్మం, నైతికత, క్షమ, లోకహితం ప్రధానమైన అంశాలుగా మహాభారతం చెప్పబ డింది. నిజానికివి సమాంతర భావాలుగా కనిపించినా విజయానంతర పరిపాలన, ప్రజల మనసులను గెలుచుకోవడం, శత్రువు ప్రభావాన్ని ప్రజల మనసుల్లో తగ్గించడం, పాలకుల పాలనను సుస్థిరం చేసేందుకు ఉపకరించే సాధనాలే.

బలంతో గెలిచిన రాజ్యం నిలవాలంటే ప్రజల మనసులు గెలవాలని, ప్రజలకు హితం కలిగిం చేవాడే స్థిరమైన రాజ్యాన్ని పొందుతాడని ధర్మరాజుకు భీష్ముడు బోధిస్తాడు. “ప్రియహితాన్యాను వర్తేత్‌” అనడం ద్వారా, ఆచా ర్య చాణక్య.. ‘శత్రువును జయించడం కంటే, జయించిన ప్రజలను తనవారిగా మార్చుకోవడం’ ముఖ్యమంటాడు. ప్రజల ఆచారవ్యవహారాలు, సంస్కృతి, ధార్మిక ఉత్సవాలు వారిని ప్రభావితం చేస్తాయి. వాటి ఆచరణలకు విఘాతం కలిగితే ప్రజ ల్లో తిరుగుబాటు వస్తుంది.

రాముడు తన పట్టాభిషేకం తదుపరి తనకు సహాయపడిన ప్రతి వ్యక్తినీ సగౌరవంగా సత్కరించిన విధానం రామా యణంలో కనిపిస్తుంది. అలాగే మహాభారతంలో ధర్మరాజు తన విజయం కోసం శ్రమించిన వారిని గుర్తించి సత్కరించడమే కాక ఇరుపక్షాల్లో యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలను కూడా ఆదరించా డు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన రాజు త్వరగా పతనమవుతాడని, న్యాయం, దానం, మృదుత్వం, గౌరవం రాజుకు రక్షణ కవచాలని చెబుతాడు, విదురుడు. 

ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చాణక్యుని స్ఫూర్తి కొంత పలుచగానే కనిపిస్తుం ది. ప్రజల మనసులు గెలుచుకోవడం వల్ల రాజ్య సుస్థిరత నెలకొంటుందన్న చాణక్యుని సూక్తులు, చాలావరకు ప్రజల భావోద్వేగాలను ప్రభావితం చేయడం వరకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ధార్మికమైన నాయకత్వం, సరైన ఎన్నికల వ్యూహం, ప్రజా సంబంధాలు.. ఈ మూడు రూపాలు మమేకమైతేనే సత్ఫలితాలు ఆవిష్కృతమవుతాయి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర ఉన్నతంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను విమర్శించడం, జాతీయ ప్రయోజనాలపై చర్చించడం, ప్రజల భావోద్వేగాలను పార్లమెంట్ వేదికగా ప్రభుత్వానికి నివేదించడం ప్రతిపక్ష నాయకుని బాధ్యత. అలాకాక, విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి వెళితే, అది రాజకీయ చర్చను భావోద్వేగ సంఘర్షణ గా మార్చే ప్రమాదం ఉంటుంది. ‘అతి కఠోర వాక్యాలు రాజ్యానికి హానికరం’ అని హెచ్చరిస్తుంది మహాభారతం. 

ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలపై భారం పడే నిర్ణ యాలు తీసుకున్నప్పు డు పాలకుల అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. చమురు ధరల పెంపు వంటి అంశాలు ప్రజల నిత్యజీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి కాబట్టి, కేవలం పరిపాలనా నిర్ణయం సరిపోదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు.. ప్రజల మనసులను గెలుచుకోవడానికి.. ధరల పెంపు ఎందుకు అవసరమైందో పారదర్శకంగా వివరించడం అవసరం. ప్రజలు అర్థం చేసుకుంటే ప్రతిఘటన చాలావరకు తగ్గుతుంది. ప్రభావిత వర్గాలకు పన్నులు తగ్గించడం, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా ఉపశమన చర్యలు చేపట్టవచ్చు. రవాణా రంగానికి మద్దతునివ్వడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుతాయి. చాణక్య చెప్పిన ‘పరిహార దానమాన కర్మభిః’ అన్న సూత్రానికిది అనువాదం అవుతుంది.

కఠిన నిర్ణయాలు తీసుకోవడం పాలనలో ముఖ్యమైన అంశమే అయినా, ఆ నిర్ణయం వల్ల జాతీయ, అంతర్జాతీయ సంబంధాలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఎలాంటిదో అంచనా వేయడం ప్రధానమైనది. ముఖ్యంగా ప్రజలకు కలిగే అసం తృప్తిని ఎలా సమతుల్యం చేస్తామన్నదే రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. ప్రజల మనసులు గెలుచుకోవడం అంటే కేవలం ప్రభావవంతమైన ప్రసంగాలు చేయడం కాదు.. ప్రజల్లో ఈ ప్రభుత్వం మన హితం కోసమే పనిచేస్తున్నదనే నమ్మకం కలిగించడం. ప్రజల బాధను తక్కువగా చూపకుండా, వారి కష్టాలను అంగీకరించడం. ప్రజల్లో తమ సమస్యను ప్రభుత్వం గుర్తించిందనే భావన కలిగితే ఆగ్రహం తగ్గుతుంది.

తాత్కాలిక కఠిన నిర్ణయాలు దీర్ఘకాల ప్రయోజనానికి దోహదం చేస్తాయని నమ్మకం కల్పించగలిగిన నాయకుని నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారు. దానితో ఆర్థిక స్థిరత్వం సాధించడం, అంతర్జాతీయ పరిస్థితులు చక్కదిద్దడం, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ సులభమవుతుంది. ప్రజాస్వామ్యంలో  విమర్శలను పూర్తిగా నిరాకరించడం నష్టంచేస్తుంది. ప్రతిపక్ష విమర్శలను కువిమర్శలుగా కాక ప్రజాభిప్రాయ సూచనలుగా స్వీకరించడం వల్ల పాలకులకు ప్రయోజనం ఉంటుంది. ప్రజలకు భారంగా అనిపించే పాలన ఎక్కువకాలం నిలవదు.

నిజమైన నాయకుడు ప్రత్యర్థిని ఓడించేందుకు ప్రయత్నించినా, గెలిచాక ప్రత్యర్థులకు కూడా తన పాలనపై విశ్వాసం కలిగేలా ప్రవర్తిస్తాడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విజయం తాత్కాలిక అధికారాన్ని ఇవ్వవచ్చు.. కానీ దానిని నిలుపుకోవడం మాత్రం ప్రజల విశ్వాసంతోనే సాధ్యపడుతుంది. భారతీయ రాజకీయ తాత్త్వికత, రాజును కేవలం పాలకుడిగా కాక, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాటిని సమన్వయపరచగల నాయ కునిగా దర్శించింది.

పాలకుర్తి రామమూర్తి