27 May, 2026 | 4:28 AM

అణచివేత ఆపి ఆలోచించండి!

27-05-2026 12:00 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దిం కలు, పరాన్నజీవులతో పోలుస్తూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఉద్యమానికి నాంది పలికాయి. సీజేఐ ఆ తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ, అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశవ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత  పది రోజులుగా పతాక శీర్షికల్లో నిలిచి పెద్ద ఎత్తున జెన్ జీ, మిలీనియం యువతను ఆకర్షించింది.

దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అదే సమయంలో ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ఆత్మపరిశీలనలో పడ్డా యి. ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకొని తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధప్రాతిపదికన క్యాబినెట్ సమావేశం నిర్వహించి దేశంలో, వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వాస్తవానికి ప్రధానమంత్రితోపాటు కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న చాలామంది మంత్రు లు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ‘బూమర్ జనరేషన్’కు చెందినవారే. వీరిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి వారు బూమర్ జనరేషన్‌కు చెందినప్పటికీ జెన్ జీ, మిలీనియం యువత ఆలోచనలు, ఆసక్తిని ఆకలింపు చేసుకుంటూ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం గమనార్హం.

సోషల్ మీడియాలో పోరు

దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులు, మంత్రులు,  పాలకుల నిర్ణయాలు యువత ఆలోచనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల యువత అంతరంగాల్లో అసంతృప్తి, నిరాశ గూడుకట్టుకుందని కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా సోషల్ మీడియాలో బట్టబయలైంది. అతి తక్కువ వ్యవధిలో ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి 2 కోట్ల మంది ఫాలోవర్లుగా మారడం ఆశ్చ ర్యం కలిగించింది. నేటి పాలకుల విధానా ల పట్ల యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు దీని ద్వారా స్పష్టమైంది. ఈ విషయాన్ని పాలకులు, రాజకీయ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

యువత అసంతృప్తికి కారణమిదే

యువతలో అసంతృప్తికి అనేక కారణాలున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికే ఏడు దశాబ్దాలు దాటింది. అనేక పార్టీలు, ప్రభుత్వాలు దేశాన్ని, వివిధ రాష్ట్రాలను పరిపాలించాయి. అయినా నేటికీ దేశంలోని ప్రజలందరికీ కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడం శోచనీయం.

ఎల్లప్పుడూ తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే లబ్ధి పొందేలా సంక్షేమ, ఉచిత పథకాలు అమలు చేయడం తప్ప, ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శాశ్వత ప్రాతిపదికన నిర్ణయాలు ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకూ తీసుకోలేదు. ఈ అంశాలను నేటి యువతరం అర్థం చేసుకోవడం శుభపరిణామం. అందుకే క్షణాల్లో లక్షల మంది కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులుగా సామాజిక మాధ్యమాల్లో చేరారు. వివిధ అంశాలను చర్చించడం, పాలకుల విధానాలు, లోపాలను ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవడంతో ఎంతో మంది నిరాశకు గురయ్యారు.

అలాగే వివిధ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవడం కూడా ఇందుకు ఆజ్యం పోసింది. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు అప్పులు చేసి మరీ వారి పిల్లలను కోచింగ్ సెంటర్లలో చదివిస్తున్నారు. రాత్రనక, పగలనక కష్టప డి చదివి తీరా పరీక్షలు రాసే సమయంలో పేపర్ లీక్ కారణంగా అవి రద్దవడం వంటివి యువతలో తీవ్ర నిరాశ, నిస్పృహలను కలుగజేస్తున్నది. అయితే ఆయా ప్రభుత్వాలను గద్దె దించేందుకు సరైన వేదిక ఇప్పటివరకు లభించకపోవడంతో ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మనగలుగుతున్నాయి. ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు యువత ఆలోచనలకు అనుగుణంగా లేకపోతే ఇక్కట్లు తప్పవని కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక వేదిక ప్రతిస్పందన ద్వారా పాలకులు గుర్తెరగాలి.

ఇకనైనా పాలకులు తమ అప్రోచ్‌ను మార్చుకోవాలి. లేకపోతే ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో జరిగిన పరిణామాలు మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది. తాత్కాలికంగా ప్రభుత్వాలు కాక్రోచ్ జనతా పార్టీ, ఎన్పీఎఫ్ వంటి సామాజిక మాధ్యమాలపై పరోక్షంగా నిషేధం, ఆంక్షలు విధించినా, మరో రూపంలో యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని గ్రహించాలి.

నిశితంగా గమనిస్తున్న జెన్ జీ

ఇప్పటికే దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులు నెలకొనడం తో ఏమి తినాలి, ఏమి కొనాలి అనే సం దిగ్ధం నెలకొంది. ప్రపంచంలో ఎక్కడైనా చిన్న సంక్షోభం వస్తే, మన దేశం విలవిలాడుతోంది. గతంలో ఇరాక్ యుద్ధం, కొవిడ్ విలయం, నేడు రష్యా ఉక్రెయిన్, ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. ఇలా ఏ రకమైన సంక్షోభం వచ్చినా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పాలకులు ధరల భారాన్ని మోపుతున్నారు. ఇలాంటి సంక్షోభాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ముందుగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కానీ, ప్రభుత్వాలు అలా చేయడం లేదు. ఈ పరిణామాలను నేటి యువత నిశితంగా గమ నిస్తున్నది. అదును కోసం ఎదురుచూస్తున్నది.

పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభ మై సుమారు మూడు నెలలైంది. కీలకమైన ఆ సమయంలో కేంద్ర పాలకులు ఐదు రాష్ట్రాల్లో అధికారం కోసం వెంపర్లాడుతూ ఎన్నికల ప్రచారంలె తలమునకల య్యారే తప్ప, ‘పొదుపు సూత్రాలు’ ఎందు కు ప్రకటించలేదని యువత ప్రశ్నిస్తున్నది. అంతేకాకుండా, దేశంలో తరచూ జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, అవినీతి, బంధుప్రీతి, సిద్ధాంతాలు, విలువులు లేకుండా స్వలాభం కోసం రాజకీయాలు చేయడం, అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులకు రాజ్యసభ సభ్యులుగా పదవులు ఇవ్వడం లేదా నామినేట్ పోస్టు లు కట్టబెట్టడం వంటి అంశాలను నేటి పౌర సమాజంతోపాటు జెన్ జీ, మిలీనియం యువత గమనిస్తున్నారు. ఇకనైనా పాలకులు తమ విధానాలను మార్చుకోవాలి. లేకపోతే తగిన మూల్యం చెల్లిం చుకోవాల్సి వస్తుందనే కఠిన సత్యాన్ని గ్రహించి గుర్తెరగాలి.

అవినీతి రహిత భారత్ నిర్మాణం

కారల్ మార్క్స్ చెప్పినట్లు ‘చరిత్ర తొలుత విషాదంగా, తరువాత ప్రహసనం లా మారుతుంది’ అని ఇకనైనా నేతలు పాలకులు గ్రహించాలి. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం యువత 35 సంవత్సరాలలోపు వారే ఉన్నారు. వీరి ఆకాం క్షలను నెరవేర్చే దిశగా రాజకీయ నేతలు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించా లి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అన్ని విషయాల్లో ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ధరలు, నిరుద్యోగ సమస్య ను నివారించడానికి చర్యలు చేపట్టాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధిపరచాలి. పేదరికం లేని, అవినీతి రహి త భారత్‌ను నిర్మించాలి.

అందమైన నినాదాలతో ఎల్లప్పుడూ ప్రజలను మోసగిం చలేరని పాలకులు ఇకనైనా గ్రహించాలి. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు తమ లోపాలను గుర్తించి, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కాగా, కాక్రోచ్ జనతా పార్టీ సామాజిక మాధ్యమం వేదికగా నేటి యువత సమకాలీన రాజకీయ అంశాలు, దేశంలోని సమస్యలపై దృష్టిసారించడం శుభపరిణామం. వీరి కదలికలను అణచివేసేందుకు ప్రయత్నం చేయకుండా, పాల కులు తమ లోటుపాట్లను సరిదిద్దుకోవ టం మంచింది. నియంతృత్వ ధోరణిని విడనాడాలి. ఏకపక్ష రాజకీయాలకు స్వస్తి పల కాలి. ముఖ్యంగా యువత ఆలోచనలు, ఆసక్తిని ఆకలింపు చేసుకుంటూ పాలనను కొనసాగించాలని ఆశిద్దాం.

వ్యాసకర్త సెల్: 6305682733

ఐ.ప్రసాదరావు