27 May, 2026 | 2:25 AM

కార్పొరేట్ కంపెనీల సాధికారత!

27-05-2026 12:00 AM

భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారతను బలోపేతం చేసిన శక్తుల్లో ‘డ్వాక్రా’ పొదుపు సంఘాల వ్యవస్థ అత్యంత కీలకమైనది. పల్లెల్లోని మహిళలను ఆర్థికంగా స్వావలంబన వైపు నడిపించడానికి ఈ సంఘా లు దశాబ్దాలుగా తోడ్పడుతున్నాయి. అయితే, మారుతున్న కాలంలో ఈ వ్యవస్థ స్వరూపం వేగంగా మారిపోతోంది.

ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పూచీకత్తు లేకుండా డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తామని, వాటి ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించవచ్చని ప్రచారం చేస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, నర్సరీలు, తేనె ఉత్పత్తి, పుట్టగొడుగుల సాగు వంటి నూతన వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఈ నినాదాల వెనుక కొన్ని కార్పొరేట్ శక్తుల వ్యాపార ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతోంది. నగరాల పరిధిలో వ్యాపారాలు ఇప్పటికే ఒక స్థాయికి చేరుకున్నాయి.

అందుకే ఇప్పుడు బహుళజాతి కంపెనీల కన్ను అపారమైన కొనుగోలు శక్తి ఉన్న గ్రామీణ మార్కెట్‌పై పడింది. పల్లెల్లోకి నేరుగా చొచ్చుకుపోవడానికి, కోట్లాది మంది వినియోగదారులను ఒకే తాటిపైకి తెచ్చుకోవడానికి డ్వాక్రా నెట్‌వర్క్ కంటే అద్భుతమైన మార్గం మరొకటి లేదు. అయితే, వీటిలో ఏ యూనిట్ స్థాపించాలన్నా వాటికి కావలసిన ముడిసరుకు, సాంకేతిక పరిజ్ఞానం లేదా యంత్రాలను సరఫరా చేసేది కార్పొరేట్ కంపెనీలే. మహిళలకు ఇస్తున్న రుణం, అంతిమంగా ఈ వస్తువుల కొనుగోలు రూపంలో నేరుగా కార్పొరేట్ ఖాతాల్లోకే వెళ్తోంది. అంటే, ఇక్కడ మహిళలు నిధుల మళ్లింపునకు ఒక సాధనంగా మిగిలిపోతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు మహిళా సంఘాలను తమకు కావలసిన వస్తువులను తక్కువ ధరకు తయారు చేసి ఇచ్చే ‘ఒప్పంద కార్మికులుగా’ వాడుకుంటున్నాయి.

ముడిసరుకును కంపెనీ ఇస్తుం ది, మహిళలు రాత్రింబవళ్లు శ్రమించి వస్తువును సిద్ధం చేస్తారు. కానీ, దానికి తమ బ్రాండ్ పేరు తగిలించి, మార్కెట్లో వందల రెట్లు లాభాలు గడించేది మాత్రం సదరు బృహత్ సంస్థాగత శక్తులే. మహిళలకు మిగిలేది కూలి మాత్రమే. మరోవైపు, మార్కెటిం గ్ వ్యవస్థలో లోపాలు మహిళలను మరింత దెబ్బతీస్తున్నాయి. తాము కష్టపడి ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్ సదుపాయం, కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల మహిళలు మళ్లీ కార్పొరేట్ మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తోంది. వాతావరణం అనుకూలించకో లేదా వస్తువుల ధరలు పడిపోయో నష్టాలు వస్తే ఆ కార్పొరేట్ కంపెనీలు తప్పుకుంటాయి గానీ, అప్పు, దాని వడ్డీల భారం మాత్రం మహిళల నెత్తినే పడుతోంది.

ఇలాంటి పథకాల వెనుక బ్యాంకుల స్వార్థం దాగి ఉందనే విమర్శలున్నాయి. పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలు అప్పులిస్తే అవి మొండిబాకీలుగా మారుతున్న తరుణంలో సమాజానికి, పరువుకు భయపడి క్రమం తప్పకుండా అప్పులు తీర్చే మహిళలను బ్యాంకులు సులువైన వినియోగదారులుగా చూస్తున్నాయి. పూచీకత్తు లేకపోయినా మహిళల ‘నైతిక బాధ్యత’ ఇక్కడ బ్యాంకులకు ఒక పెద్ద హామీగా మారుతోంది.

ఏ ప్రభుత్వం వచ్చినా రుణాల పంపిణీ సంఖ్యలను తమ విజయాలుగా చూపించుకొని ఓట్ల రాజకీయం చేయడం పరిపాటిగా మారింది కానీ, ఆ రుణాల వల్ల ఎంతమంది మహిళలు నిజంగా కోటీశ్వరులయ్యారు, ఎంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయారనే సామాజిక తనిఖీ జరగడం లేదు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన నిజం కావాలంటే, అది కార్పొరేట్ శక్తుల లాభాల పెరటికి చేరకూడదు.

ప్రభుత్వాలు బ్యాంకు రుణాలను నిర్దేశించి చేతులు దులుపుకోకుండా.. కార్పొరేట్ కంపెనీల మధ్యవర్తిత్వం లేని ఒక బలమైన ‘సహకార మార్కెటింగ్ వ్యవస్థను’ నిర్మించాలి. మహిళల ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి, ప్రభుత్వమే విక్రయించే ఏర్పాట్లు చేయాలి. ఆధునిక వ్యాపార నైపుణ్యాలపై క్షేత్రస్థాయిలో నిజమైన శిక్షణ, నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పుడే మహిళలు నిజమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరు. లేదంటే, మహిళా సాధికారత అనే నినాదం కాగితాలకే పరిమితమై, నిరుపేద మహిళల శ్రమ కార్పొరేట్ శక్తుల మూలధనంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ శృంఖలాలను తెంచే దిశగా పాలకులు, సామాజిక విశ్లేషకులు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. 

వ్యాసకర్త సెల్: 9848559863

వెంకగారి భూమయ్య