calender_icon.png 6 February, 2026 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాతో ట్రేడ్ డీల్ బలానిచ్చింది

06-02-2026 01:50:05 AM

దేశ పరపతి పెరిగింది

  1.   27 దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు
  2. మరో 9 దేశాలతో ట్రేడ్‌డీల్‌తో ముందుకు..
  3. విపక్షాలు రాష్ట్రపతిని, రాజ్యాంగాన్ని అవమానించాయి
  4. రాజ్యసభలో విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత్‌కు ఎంతో బలాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలో దేశ పరపతి పెరుగుతోందని, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దేశం దూసుకెళుతోందని వ్యాఖ్యానించారు. ఐరోపా దేశా ల సమాఖ్య సహా 27 దేశాలతో భారత్ అనేక ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. 9 దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటు న్నామని చెప్పారు.

రీఫార్మ్, పెర్ఫార్మ్.. ట్రాన్స్‌ఫార్మ్ దిశగా భారత్ సాగుతోందని అన్నారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని రాజ్యసభలో ప్రసంగించారు. విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ ప్రధాని ప్రసంగించారు. ఆ తరువాత కొద్ది సేపటికే విపక్షాలు వాకౌట్ చేశాయి. అయితే, ప్రధాని మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

‘రాష్ట్రపతి పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో చర్చ జరగకపోవడం రాష్ట్రపతి పదవికే అవమానకరమన్నారు. లోక్‌సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ ఎంపీని ద్రోహి అన్నారు. బిట్టు సిక్కు కావడంతో ఆయనను అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది’ అని ప్రధాని మండిపడ్డారు.

మూడో ఆర్థిక వ్యవస్థగా..

‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్‌తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేని కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు.  ఎన్టీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని తెలిపారు. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం కలగలిసిన అరుదైన స్థితిలో భారత్ ఉందన్నారు. మునుపటి ప్రభుత్వాల తప్పులను సరిచేసేందుకే అధిక శాతం తమ శక్తియుక్తులను వినియోగించాల్సి వస్తోందని అన్నారు.

గత ప్రభుత్వాల కారణంగా మూటగట్టుకున్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించుకుంటున్నామని చెప్పారు. ఈ నష్టాన్ని సరిచేసేలా భవిష్యత్తుకు తగిన విధానాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. బ్యాంకుల బలోపేతానికి అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా బ్యాంకుల నుంచి ఇప్పుడు పేదలకు రుణాలు అందుతున్నాయని తెలిపారు.  ముద్ర యోజన ద్వారా అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు లబ్ధి పొందుతున్నారని ప్రధాని వివరించారు. 

కాంగ్రెస్‌కు దార్శనికత లేదు..

ప్రపంచదేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ అవతరించిందని ప్రధాని చెప్పారు. యూపీఏ హయాం లో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వ్యవస్థలు బలహీనపడతాయని అన్నా రు. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ఉత్సుకతతో ఉన్నాయని చెప్పారు.

ఈయూ ట్రేడ్ డీల్‌తో ప్రపంచంలో స్థిరత్వంపై వివిధ దేశాలకు నమ్మకం పెరి గిందని అన్నారు. అమెరికాతో ఒప్పందంతో ఈ భావన మరింత బలప డిందని వ్యాఖ్యానించారు. ‘దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గతంలో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, భారతదేశానికి ఉన్న సమస్య ఏమిటని అక్క డివారు అడిగారు. 38 కోట్ల సమస్యలు ఉన్నాయని నెహ్రూ చెప్పారు. అప్పుడు మన దేశ జనాభా ౩౩ కోట్లు. దేశ పౌరులే సమస్య అన్నట్లుగా మాట్లాడి నెహ్రూ, ఆ దేశంలో భారతదేశ పరువును మంటగలిపారు.

ఇప్పుడు దేశ జనాభా ౧౪౦ కోట్లు. దేశ జనాభాను మేం మానవ వనరుగానే చూస్తున్నాం’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు మొదటినుంచి దార్శనికత లేదని విమర్శిం చారు. మానవ వనరులను వినియోగించుకోవడంలో విజన్ లేదంటూ మోదీ మండిపడ్డారు. ఎన్డీయే హయాంలో దేశం అలా లేదని ఉత్పత్తి రంగంలో అనే క విజయాలు సాధించామని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. రానున్న 25 ఏళ్లు భారత్‌కు అత్యంక కీలకమని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతి సాధనలో వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు.