8 July, 2026 | 3:34 AM

12 కోట్ల పని దినాల లక్ష్యాన్ని సాధించాలి

08-07-2026 01:48 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): వీబీజీ రామ్-జి పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6,311 కోట్ల బడ్జెట్‌కు ప్రభు త్వం ఆమోదం తెలిపిందని, జూలై నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 కోట్ల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ ఐదు లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించే దిశగా   పనిచేయాలని ఆదేశించారు.

జిల్లా అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్), ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, ఇతర అధికారులతో మంత్రి సీతక్క మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన విధానాలు, మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో పనిచేసే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులకు సమగ్ర అవగాహన కల్పించేందుకే బుధవారం నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.