15 March, 2026 | 4:43 AM

చిన్న తిరుపతి.. సన్నూరు ఆలయం

15-03-2026 12:53 AM

కలియుగధీశుడు, పిలిస్తే పలికే దైవం, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహించడానికి వివిధ ప్రదేశాల్లో కొలువై ఉన్నాడ నడానికి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు గ్రామం వెంకటేశ్వర్ల పల్లెలో స్వయంవ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిదర్శనంగా నిలుస్తోంది. 700 ఏళ్ల క్రితం తన భక్తుడి కష్టాన్ని చూడలేక తనంతట తానుగా శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన క్షేత్రంగా, చిన్న తిరుపతిగా ఈ ఈ దేవాలయం పేరుగాంచింది. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే విధంగానే ఇక్కడ కూడా విశేష ఉత్సవాలు, సేవలు నిర్వహించ డం ఆనవాయితీగా వస్తోంది.

ఆలయ చరిత్ర

సుమారు 700 సంవత్సరాల క్రితం నంగునూరి వంశానికి చెందిన ఓ భక్తుడు ప్రతి సంవ త్సరం తిరుమలకు పాదయాత్ర చేసి స్వామిని దర్శించుకునే వాడు. ఆ సంవత్సరం కూడా అదే విధంగా పాదాచారుడై ఈ మార్గం గుండా వెళుతుండగా ఆయాసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ రాత్రి ఆ భక్తుడి కలలో స్వామి కనిపించి ‘నీ భక్తికి మెచ్చాను. ఇక నుంచి నువ్వు కష్టపడుతూ ఏడుకొండలు ఎక్కి నా దగ్గరకు రావలసిన అవసరం లేదు.

నేనే స్వయంగా ఇక్కడే వెలుస్తాను. నాకు ఆలయం నిర్మించి నన్ను సేవించుతూ తరించు’ అని చెప్పాడు. ఇందుకు నిదర్శనంగా ప్రస్తుత ఆలయానికి వాయువ్య దిశలో ఒక పెద్ద బండ మూడు ముక్కలుగా పగిలి అందులో దక్షిణ ముఖంగా స్వామివారు ఆవిర్భవించారు. ఉద యం మేల్కొన్న భక్తుడు కలలో వచ్చిన విధంగానే అక్కడ చూడగా స్వామివారిని చూసి పూజలు నిర్వహించేవాడు. 

స్వామి స్వయం వ్యక్తంగా వెలసిన చోట ఆలయ నిర్మాణానికి పూనుకోగా బండరాతిని తొలగించడం, దేవాలయం నిర్మిస్తే ఇబ్బంది కలిగి నిష్ఫలం అవుతుందని బాధపడుతుండగా పండితుల సలహాతో 41 రోజులపాటు శ్రీనివాస దీక్ష నిష్టతో చేపట్టి ఏదైనా పరిష్కార మార్గం చూపుతారని చెప్పడంతో ఆ విధంగా స్వామివారిని సేవించాడు. ఆ భక్తుడు చేపట్టిన దీక్షకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి తూర్పుముఖంగా ఆవిర్భవించారు. దీనికి సంతోషించిన భక్తుడు వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యులైన ‘పన్నిద్దారాల్వారాదులు’గా అవతరించిన రూపాన్ని చూసి సంతోషపడి అక్కడ గర్భాల య నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడ శివుడు నిలుస్తున్నారు.

ఈశాన్య దిశలో శివాలయం నిర్మించి పరమేశ్వరునికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు. రాయపర్తి మండలానికి చెందిన ఆరుట్ల వంశస్తులైన శ్రీ వైష్ణవులను అర్చకులుగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోగా కుందూరు వంశస్థులు, ఎర్రబెల్లి వంశస్థులు సంయుక్తంగా ఆలయానికి ముఖ మంటపం, అర్ధ మండపం, గోదా సన్నిధి, రామానుజ నమ్మాళ్వార్, మణవాళ్ మహాముని,  ప్రత్యేక సన్నిధిలు, ధ్వజస్తంభం, యాగశాల, రామానుకూటం, కొట్టడి, వాహన శాల, సింహద్వారం, కళ్యాణమంటపం నిర్మించారు.

స్వామివారికి ఆధ్యాయనోత్సవం, బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. దీని తో ఈ దేవాలయ ప్రాశస్త్యం ఈ ప్రాంతంలో నలు దిశల వ్యాప్తించి విశేషంగా భక్తుల రాక తో సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం చిన్న తిరుపతిగా ఖ్యాతి గడించింది. కోరిన కోరికలు తీరితే కోడెలు కట్టే విశిష్ట సంప్రదా యం గల ఏకైక శ్రీ వైష్ణవ క్షేత్రంగా సన్నూరు దేవాలయం నిలుస్తోంది. 

ఆధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు

స్వామివారికి ఏటా మాఘ శుద్ధ దశమి నుంచి త్రయోదశి వరకు ఆధ్యాయనోత్సవాలు, మాఘశుద్ధ త్రయోదశి సాయంత్రం నుం చి మాఘశుద్ధ బహుళ పంచమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అనువంశిక అర్చకుడు ఆరుట్ల రంగాచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో స్వామివారు దేవేరులతో కలిసి చిన్న శేష వాహనం, పెద్దశేష వాహనం, పల్లకి, తిరుచ్చి, హనుమత్, గరుడ, గజ, అశ్వ, దేవరాజ కాళింగి, మర్దనాది వాహనంలపై గిరి ప్రదక్షణ చేస్తారు. మాగశుద్ధ పౌర్ణమి రోజు రాత్రి 7 గంటలకు స్వామివారికి తిరు కళ్యాణం నిర్వహిస్తారు. 

విశేష ఉత్సవాలు

ఉగాది రోజు పంచాంగ శ్రవణం, ప్రతినెల శ్రవణా నక్షత్రం నాడు శ్రీనివాస కళ్యాణం, శుద్ధ పాడ్యమి నాడు శ్రీవారికి అభిషేకం, బహుళ చతుర్దశి రోజున సుదర్శన శ్రీనివాస హోమం, ఏకాదశి రోజున శ్రీ విష్ణు సహస్రనామార్చన, శరన్నవరాత్రుల సందర్భంగా మహా లక్ష్మి అమ్మవారికి అష్టలక్ష్మి అలంకారాలతో రోజుకు ఒక దర్శనం నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణ మి రోజున ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం, రాత్రి దీపోత్సవం, ధనుర్మాస ఉత్సవాలు 30 రోజులపాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భోగి రోజున గోదారంగనాధుల కల్యాణ వేడుకలు, ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం, గరుడ వాహనం, శ్రీవారి దర్శనం నిర్వహిస్తారు. అలాగే తిరునక్షత్ర ఉత్సవాలను కూడా బ్రహ్మాండ నాయకుడికి కన్నుల పండుగ నిర్వహిస్తారు. 

దేవాలయానికి చేరుకునే మార్గాలు

వరంగల్, ఖమ్మం, తొర్రూరు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. తొర్రూరు నుంచి ప్రైవేటు వాహనాల్లో సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు.

బండి సంపత్ కుమార్ (మహబూబాబాద్, విజయక్రాంతి)