చీలికల ఆరాటం.. గుర్తుల పోరాటం
దుప్పటి మొగిలి :
మన దేశంలో రాజకీయ పార్టీలు పుట్టడం ఎంత సహజమో, చీలిపోవడం కూడా అంతే సహజం. పదవుల పందేరం, సిద్ధాంత భేదాలు, నాయ కత్వ పోరు, వారసత్వ రాజకీయాలు, అధికార పోటీలు అన్నీ కలిసి పార్టీని రెండు లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విభజించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మన దేశంలో ఎన్నో పెద్ద పార్టీలు ప్రత్యర్థుల కారణంగా కాదు, చీలిపోయి బల హీనపడ్డాయి. అయితే పార్టీ చీలిపోయినప్పుడు ప్రజల్లో కలిగే సందేహం అసలు పార్టీ ఎవరిది? పార్టీ గుర్తు ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత భార త ఎన్నికల సంఘంపేనే ఉంటుంది. ఈ క్రమంలో ఈసీ తీసుకునే నిర్ణయాలపై ఈ మధ్యకాలంలో తీవ్ర చర్చ జరుగుతున్నది.
మన దేశంలో అత్యధిక ఓటర్లు అభ్యర్థి పేరు కన్నా పార్టీ గుర్తునే చూసి ఓటు వేస్తారు. పార్టీ గుర్తు ఒక బొమ్మ మాత్రమే కాదు, ఆ పార్టీ వ్యవస్థాపకుడి పట్ల నమ్మ కం, అభిమానం, ఆ పార్టీ చరిత్ర, భావజా లం, కార్యకర్తల కష్టం, ప్రజల విశ్వాసానికి ప్రతీక. స్వాతంత్య్రం తరువాత భారత రాజకీయాల్లో మొదటి చీలిక 1969లో కాం గ్రెస్ పార్టీతోనే మొదలైంది.
కే కామరాజ్, నీలం సంజీవరెడ్డి, మొరార్జీ దేశాయ్ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ మాట విం టారని భావించి, 1966లో ఇందిరాగాంధీని ప్రధానిని చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, ప్రధాని అయ్యాక ఇందిర స్వతంత్రంగా వ్యవహరించడం కాంగ్రెస్‌లో చీలికకు దారితీసింది. సంప్రదాయ ధోరణి గల వీరు 14 బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి ఇందిర నిర్ణయాలను వ్యతిరేకించారు.
1969 రాష్ట్రపతి ఎన్నికల్లో సీనియర్ నేతల వర్గం అధికారిక అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని నిలబెట్టగా, వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా ఇందిర బరిలో దించారు. ఎంపీ లు, ఎమ్మెల్యేలు తమ ఆత్మప్రబోధానుసా రం ఓటు వేయాలని ఇందిర పిలుపునివ్వడంతో వీవీ గిరి విజయం సాధించారు. ఫలితంగా కాంగ్రెస్ (ఓ కాం గ్రెస్ (ఆర్ వర్గం)గా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఆ సమయంలో ఎన్నికల సంఘం పార్టీ గుర్తు విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అప్పటి అధికారిక గుర్తు కాడెద్దుల జతను ఈసీ స్తంభింపజేసింది. సిండికేట్‌కు రాట్నం తిప్పుతున్న మహిళ గుర్తు దక్కగా, ఇందిరా కాంగ్రెస్‌కు ఆవు-దూడ గుర్తు లభించింది.చివరికి 1971 ఎన్నికల్లో గరీబీ హటావో నినాదంతో ఇందిరాగాంధీ భారీ విజయం సాధించి, సిండికేట్‌ను రాజకీయంగా తుడిచిపెట్టేసి తిరుగులేని శక్తిగా ఎదిగారు. తరువాత 1978లో కాంగ్రెస్(ఐ)గా మారి ప్రస్తుత హస్తం గుర్తువచ్చింది. గుర్తు కోల్పోయినా పార్టీ బతకగలదు. కానీ, ప్రజల విశ్వాసం కోల్పోతే పార్టీ బతకలేదని ఈ సంఘటన నిరూపించింది. ఆ తర్వాత ఇలాంటి చీలికలు దేశంలో ఎన్నో జరిగాయి.
బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీ శివసేన. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొంది. దీంతో ఎన్నికల సంఘం శాసనసభాపక్ష బలాన్ని ప్రాతిపదికగా తీసుకుని అధికారిక శివసేన పేరు ను, విల్లు బాణం గుర్తును షిండే వర్గానికే కేటాయించింది. ఉద్ధవ్ వర్గానికి కొత్త పేరు, కొత్త గుర్తు ఇచ్చింది.
2023లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌పై అజిత్ పవా ర్ తిరుగుబాటు చేసి మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎన్డీయేలో చేరారు. అజిత్ పవార్ వర్గానికి ఎన్నికల సంఘం అధికారిక గోడ గడియారం గుర్తును, పార్టీ పేరును కేటాయించింది. ఇది వ్యవస్థాపకుడే పార్టీని కోల్పోయిన అరుదైన ఘటనగా చర్చనీయాంశమైంది.
2017లో ఉత్తరప్రదేశ్‌లో తన తండ్రి ములాయంసింగ్ యాదవ్, బాబాయ్ శివపాల్‌లపై అఖిలేష్ తిరుగుబాటు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అఖిలేష్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తును, సమాజ్‌వాదీ పేరును అఖిలేశ్ వర్గానికే ఈసీ ఇచ్చింది. రామ్ విలాస్ పాశ్వాన్ మరణానంతరం చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పాశ్వాన్ వర్గాలుగా పార్టీ విడిపోయింది.
ఎన్నికల సంఘం పాత గుర్తును నిలిపివేసి, రెండు వర్గాలకు కొత్త గుర్తులు ఇచ్చింది. ఎంజీఆర్ మరణం తర్వాత జాన కి రామచంద్రన్, జయలలిత మధ్య పోరు తో పార్టీ చీలింది. రెండు వర్గాలకు వేర్వేరు గుర్తులు ఇచ్చారు. చివరికి జయలలిత ప్రజల మద్దతుతో పార్టీని తిరిగి ఏకం చేసి అసలైన వారసురాలిగా నిలిచారు.
భారతదేశంలో నమోదిత రాజకీయ పార్టీ చీలిపోయినప్పుడు ఎన్నికల సంఘం ప్రధానంగా రెండు అంశాలను పరిశీలిస్తుంది. ‘ది ఎలక్షన్ సింబల్స్ రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్, 1968’ చట్టం ప్రకారమే ఏ వర్గానికి అసలైన గుర్తింపు ఇవ్వాలి, అధికారిక గుర్తును కేటాయించాలనే నిర్ణయాన్ని ఈసీ తీసుకుంటుంది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో ఏ వర్గాని కి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల మద్ద తు ఉందనేది అత్యంత కీలకం.
పార్టీ జాతీ య కార్యవర్గం, జనరల్ కౌన్సిల్, వివిధ స్థాయిల ప్రతినిధులలో ఎవరికి ఎక్కువ ఆధిక్యం ఉందో లెక్కిస్తారు. పార్టీ అంతర్గత ఎన్నికల విధానం, నిర్ణయాధికారాల నియమాలను పరిశీలించి ఎన్నికల సంఘం టెస్ట్ ఆఫ్ మెజారిటీ నిర్వహించి అసలైన పార్టీని నిర్ణయిస్తుంది.
పశ్చిమ బంగాల్‌లో 1998లో కాంగ్రెస్ నుంచి చీలిపోయి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు చీలిక ముప్పు ముంగిట నిలిచింది. టీఎంసీ రెబ ల్ వర్గం నేత పశ్చిమ బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో నేడు రెబల్, రేపు అసలు వారసుడు అనే పరిస్థితులు కొత్తవి కావు. అయితే చట్టపరంగా పార్టీ గుర్తు, అధికారిక హోదా పొందాలంటే సంఖ్యాబలం, ప్రజా మద్దతు, సంస్థాగత బలం అవసరం. టీఎంసీకి ఇప్పటికీ మమతా బెనర్జీ నాయకత్వం, కేడర్ బలం ఉన్నప్పటికీ రెబల్ వర్గం ఎదగడం భవిష్యత్తులో పెద్ద రాజకీ య మార్పులకు దారితీయవచ్చు.
అయితే, ఎన్నికల సంఘం నిర్ణయాలపై అనేక విమర్శలు ఉన్నాయి. పార్టీ అంటే నాయకుడా? లేక సభ్యుల మెజారిటీయా? ఈ రెండు భావనల మధ్యే వివాదం తిరుగుతుంది. శరద్ పవార్ లేకుండా ఎన్సీపీని ఊహించగలమా? అని ఓ వర్గం అడుగుతుంది. స్థాపకుడే పార్టీని కోల్పోవడం న్యాయమా? పార్టీని నిర్మించిన వ్యక్తి కంటే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే పార్టీ మొత్తం వారిదైపోవడం సరైందా? ప్రజలు ఒక నాయకుడిని పార్టీ భావజాలాన్నీ చూసి ఓటు వేస్తారు.
అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మారితే పార్టీ గుర్తు మారిపోవడం ప్రజా తీర్పునకు విరుద్ధమని కొం దరు వాదిస్తారు. అధికారంలో ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రతి పక్షాలు ఆరోపిస్తుంటాయి. అదే సమయం లో పార్టీ అనేది ఒక్క నాయకుడి వ్యక్తిగత ఆస్తి కాదు. మెజారిటీ సభ్యులు ఎవరిని అంగీకరిస్తే వారే అసలు పార్టీ. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కూడా ముఖ్యమైన ప్రమాణం. లేకపోతే ప్రతి వివాదం కోర్టు ల్లో సంవత్సరాల పాటు పెండింగ్‌లో ఉం టుందని సమర్థించేవారు ఉన్నారు.
రాజకీయ పార్టీల చీలికలు, గుర్తుల వివాదాలను పరిశీలిస్తే ఎవరి వద్ద సంఖ్యాబలం ఉంటే, వారికే గుర్తు చెందుతుందనే పరిస్థితి గత కొన్నేళ్లలో కనిపించింది. అయి తే, చట్టం సంఖ్యలను చూసి గుర్తును ఇవ్వగలదు, కానీ ప్రజాదరణను ఇవ్వదు. పార్టీ ని గెలిపించేది జెండా వెనుక నిలిచే కార్యక ర్త. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన నాయకుడు కొత్త గుర్తుతోనైనా మళ్లీ పుంజుకోగలడు.
గుర్తును దక్కించుకున్నం త మాత్రాన ప్రజాదరణ దక్కుతుందని గ్యారెంటీ లేదు. టీఎంసీ అయినా, భవిష్యత్తులో మరే ఇతర ప్రాంతీయ పార్టీ అయి నా మనుగడ సాగించాలంటే చట్టబద్ధమైన గుర్తులు మాత్రమే సరిపోవు. సంస్థాగత ఐక్యత, ప్రజా విశ్వాసం అనే పునాదులు బలంగా ఉండాలి. అంతిమంగా తీర్పు ఇచ్చేది ప్రజలే అన్న విషయాన్ని మరువకూడదు.
వ్యాసకర్త సెల్: 8466827118






