సంపన్నులకు ‘భరోసా’ వద్దు!
డా.పర్వతం వెంకటేశ్వర్ :
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి 2018లో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం, కాంగ్రెస్ హయాం లో రైతుభరోసా పేరిట ఒక విప్లవాత్మక అడుగుగా మొదలై, కాలక్రమేణా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ఒక వ్యూహాత్మక సాధనంగా మారిపోయింది. 2018-2023 మధ్యకాలంలో సుమారు రూ.65,500 కోట్లకుపైగా ఖర్చుచేసిన ఈ పథకం, 60 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది.
అయితే, దాని అమలు తీరులో ఉన్న లోపాలు నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పథకానికి భారీగా నిధులు కేటాయించడం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడింది. దీనికి తోడు భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సంక్షేమ పథకాల కోసం చేసిన అప్పులు రాష్ట్ర ఆర్థికస్థితిని దిగజార్చాయి.
ఏటా రూ.14,000 కోట్లకు పైగా నిధులను ఎటువంటి ఆదాయ పరిమితి లేకుండా పంచడం వల్ల, అప్పు తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేసే దుస్థితికి రాష్ట్రం చేరుకుంది. ఆదాయాన్ని సృష్టించే ప్రాజెక్టుల కంటే, ఓటుబ్యాంకును కాపాడుకునే నగదు బదిలీ పథకాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్ర అప్పుల భారం అనూహ్యంగా పెరిగింది. గత ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాల కోసం, ఆదాయం ఉన్నవారిని కూడా రైతుబంధు లబ్ధిదారులుగా చేర్చింది.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకు లు, అమెరికాలో ఉన్న సంపన్నులకు కూడా సబ్సిడీలు ఇస్తూ,‘అందరికీ సమాన సాయం’ అనే పేరుతో అసలైన పేద రైతుల హక్కుల ను హరించింది. ఇది సంపద పునఃపంపిణీకి విరుద్ధమైన విధానం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ, సంస్కరణలను అమలు చేయడంలో వెనుకాడుతోంది. అప్పుల భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పాత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తూ సంపన్న వర్గాలకు లబ్ధి చేకూర్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని విస్మరిస్తోంది.
ఈ రెండు పార్టీల ధోరణి వల్ల, అసలైన సామాజిక న్యాయం మృగ్యమైంది. కౌలు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్నకారు రైతులు నేటికీ అప్పుల ఊబిలో ఉంటే, పన్ను చెల్లించే సంపన్న వర్గాలకు ప్రభుత్వ నిధులు సబ్సిడీలుగా వెళ్లడం ఏ రకమైన న్యాయం? రాష్ట్ర అప్పులు పెరగడానికి, సామాజిక న్యాయం లోపించడానికి ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల విధానాలే కారణమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నా యి.
ఒక సంక్షేమ ప్రభుత్వం అంటే అందరికీ పంచడం కాదు, అవసరమైన వారికి చేరవేయడం. రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం చేసే ఈ ‘అసంబద్ధ పంపిణీ’ విధానా లు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయి. సంపన్న వర్గాలకు రైతు భరో సా అవసరం లేదు. రైతుకు ఎంత ఎక్కువ భూమి ఉన్నా, మూడు ఎకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి.
ఆదాయ పన్ను కట్టే వారికీ రైతుభరోసా ఇవ్వవద్దు. ప్రభుత్వం పేద రైతు ల హక్కును కాపాడి, సామాజిక న్యాయాన్ని అమలు చేసినప్పుడే నిజమైన ప్రజాస్వా మ్యం పరిఢవిల్లుతుంది. పాలకుల విధానా ల్లో మార్పు రాకపోతే, రాష్ట్రం ఆర్థిక సంక్షో భం వైపు పయనించడం ఖాయం.
ఆధిపత్య కులాల ప్రభావం
అధికార రాజకీయాల్లో ఆధిపత్య కులాల పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. పాలక వర్గాలు, నిర్ణయాధికార స్థానాల్లో ఉన్నవారు స్వతహా గా భూస్వామ్య నేపథ్యం ఉన్నవారే కావడంతో, వారి విధానాలు సహజంగానే ‘భూమి ఉన్నవారికి’ అనుకూలంగా ఉంటున్నాయి. రైతు భరోసా అనేది భూమికి ఇచ్చే సాయం, సాగు చేసే వ్యక్తికి ఇచ్చేది కాదు. భూమి యాజమాన్యం ఎవరి చేతుల్లో ఉం దో, ఆ సంపన్న వర్గాలకే ఈ నిధులు చేరుతున్నాయి. ఇది ఆధిపత్య వర్గాల ఆర్థిక స్థిర త్వాన్ని కాపాడుతూ, భూమి లేని వారిని (వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు) వ్యవస్థా పరంగా దూరం పెడుతోంది.
కౌలు రైతుల విస్మరణ
నిజానికి భూమిని నమ్ముకొని, ప్రాణాల కు తెగించి పంటలు పండిస్తున్న కౌలు రైతు లు రాష్ట్రంలో 36 శాతం ఉన్నారు. కానీ, ప్రభుత్వం వారిని ‘రైతులు’గా గుర్తించడానికి కూడా వెనుకాడుతోంది. భరోసా కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్నవారికే అందుతుంది. భూమి యజమాని ఎక్కడో పట్టణా ల్లోనో, విదేశాల్లోనో ఉన్నా సరే, సబ్సిడీ మాత్రం వారికే వెళ్తోంది. వారి భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న కౌలు రైతుకు మాత్రం చిల్లీగవ్వ సాయం అందడం లేదు.
కౌలు రైతులు అధికంగా దళిత, బహుజన, వెనుకబడిన వర్గాలకు చెందినవారే. ఈ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వల్లే, వారి కోసం చట్టా లు చేసేటప్పుడు పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫె స్టోలో కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చాక ఈ హామీని అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది.
రాజకీయ సంకల్ప లోపం, భూమి యజమానులు, ముఖ్యంగా ఆధిపత్య కులాల ఓటుబ్యాంకు దెబ్బతింటుందనే భయమే ఇందుకు కారణం. కానీ, క్షేత్రస్థాయిలో అమలు చేయాలంటే ‘భూస్వా మ్య ఆధిపత్యం’ నుంచి పాలకులు బయటపడాలి. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు ఏవీ కౌలు రైతులకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. ఇది ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అన్యా యం. భూమి ఉన్న సంపన్న వర్గాలకు సబ్సిడీలు ఇస్తూ, భూమిని నమ్ముకొని బతుకుతు న్న కౌలు రైతును ‘రైతు’గానే గుర్తించకపోవడం అప్రజాస్వామికం.
రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలు పేపర్లకే పరిమితం కాకుండా ఉండాలంటే, కౌలు రైతులకు ప్రత్యేక గుర్తింపుకార్డులు ఇచ్చి, వారికి నేరుగా పెట్టుబడి సాయం అందేలా చట్టం చేయాలి. ఇది జరగాలంటే సామాజిక చైతన్యం పెరగాలి. కౌలు రైతుల సంఘాలు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలి. ఇకనైనా పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల నుం చి బయటకు రావాలి. సంపన్న వర్గాలను ఈ పథకం నుంచి మినహాయించాలి. నిర్ణీత ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి సాయం నిలిపివేయాలి. అప్పు ల భారాన్ని తగ్గించేలా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ఆదాయాన్ని పెంచే ప్రాజెక్టుల వైపు మళ్లాలి.
రైతు భరోసా వంటి పథకాల అసలు ఉద్దేశం చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం. వ్యవసాయ ఆదాయం అనిశ్చితంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి కారణాల వల్ల రైతులు ఎదు ర్కొనే ప్రమాదాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రజాధనాన్ని అత్యంత అవసరము న్న రైతులకు కేటాయించడం, కౌలు రైతులను కూడా చేర్చడం, ఆదాయం, భూవిస్తీ ర్ణం ఆధారంగా అర్హతను నిర్ణయించడం వం టి సంస్కరణలు అవసరం. లేకపోతే సంక్షేమ పథకాలు సా మాజిక న్యాయం కంటే రాజకీయ ప్ర యోజనాల సాధనంగా మిగిలిపోతాయి.
వ్యాసకర్త: ఓబీసీ ఇంటెలెక్చువల్
ఫోరమ్ కన్వీనర్, 9177566741






