8 June, 2026 | 4:02 AM

సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి

08-06-2026 12:13 AM

కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు ఉధృతం గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని 

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7, (విజయక్రాంతి): కార్మికుల శ్రమతో  సింగరేణి సంస్థ మనుగుడా సాగిస్తోందని. ఆ యాజమాన్యం సంస్థ కు మూలాధారమైన  కార్మికులను చిన్న చూపు చూస్తోందని. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న యాజమాన్యం ఇకనైనా మానుకోవాలని  కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటే  పోరాటాలు చేయక తప్పదని  సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. 

కొత్తగూడెం ఆర్సీఓఏ క్లబ్లో ఆదివారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  (ఏఐటీయూసీ) కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే విధానాలను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావలసిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్లర్క్ పోస్టుల భర్తీ, డిస్మిస్ అయిన కార్మికులకు ప్రత్యేక అవకాశం కల్పించడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గత నెల గోలేటి నుంచి కొత్తగూడెం వరకు నిర్వహించిన సింగరేణి జాత విజయవంతం కావడంలో సహకరించిన కార్మికులు, నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో కార్మిక వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయని విమర్శించారు.

పెర్క్స్పై ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలని, స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మైనింగ్ స్టాఫ్ ప్రమోషన్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నాయకులు కోరారు. 

సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు యూనియన్ నాయకుడు కొమురయ్య కాంస్య విగ్రహ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అదనపు కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, సెంట్రల్ సెక్రటరీలు వంగ వెంకట్ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.