8 March, 2026 | 10:58 AM

99 రోజుల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి

08-03-2026 12:30 AM
  1. ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ను విజయవంతం చేయాలి

హౌసింగ్ బోర్డు పరిధిలోని 5 వేల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలి మంత్రి పొంగులేటి 

రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): ప్రజాపాలన- ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హౌసింగ్ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేషన్లను క్లియర్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా వేగవంతమైన సేవలు అందించడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు రూపొందించిన రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను శనివారం సచివాలయంలో ప్రారంభించారు. అలాగే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల్లో హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డ్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఇండ్లు, ఫ్లాట్లు, స్థలాలను వాయిదాల రూపంలో కొనుగోలు చేశారని, ఇందులో కొంతమంది అసలు మరికొంతమంది వడ్డీలు చెల్లించాలని, ఇంకొంతమంది వాయిదాల గడువు ముగిసిపోయిందని తెలిపారు.

ఈ విధంగా దాదాపు ఐదు వేల మంది తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని ఈసందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసలు, వడ్డీ, ప్రస్తుత మార్కెట్ ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్, సీఈ రమణారెడ్డి పాల్గొన్నారు.