24 August, 2026 | 5:17 AM

గుర్తింపు సంఘం కార్మికులను మోసం చేస్తుంది

24-08-2026 02:42 AM

సీఐటీయూ గౌరవ అధ్యక్షులు భూపాల్ 

నస్పూర్, ఆగస్టు 23: గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఒంటరిగా సమ్మె నోటీసు ఇచ్చి చర్చలకు వెళుతున్నామనీ, విఫలమైతే సమ్మె అంటూ మాయ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తూ కార్మికులను మోసం చేస్తుందనీ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు భూపాల్ అన్నారు. ఆది వారం సీ సీ సీ ప్రెస్ క్లబ్ లో జరిగిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్ లతో కలిసి మాట్లాడారు.

కార్మిక సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాట కార్యక్రమానికి రూపకల్పన ఎందుకు చేయడం లేదన్నారు. ముఖ్యంగా సంస్థలో అభివృద్ధి కోసం రెండు సంవత్సరాలుగా నిధులు కేటాయిస్తున్నా కార్మికుల రక్షణకు సంబంధించిన పరికరాలు సప్లై చేయక పోవడంపై గుర్తింపు సంఘం సేఫ్టీ సమావేశాలు, యాజమాన్యంతో నిర్వహించే సమావేశాల్లో గట్టిగా ప్రశ్నించకపోవడం వల్లనే ఆలస్యం అవుతున్నాయన్నారు.

మరోవైపు పరిష్కరించాల్సిన వారే పోరాడుతున్నామన్నట్లు ధర్నాలు చేస్తూ కార్మికులను మభ్యపెట్టడం ఎంతవరకు సరైనదని విమర్శించారు. మరోవైపు సంస్థకు వచ్చిన లాభాలను తెలియజేయడానికి వెనుకడుగు వేయడానికి కారణాలు ఏమిటని, వెంటనే సంస్థ లాభాలు, బకాయిలను తెలియజేసి వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేబర్ కమిషనర్ సింగరేణికి నిర్వహించిన ఎన్నికల కాల పరిమితి ముగిసినందున యాజమాన్యం అన్ని యూనియన్లను సమానంగా గుర్తించాలన్నారు.

సంస్థలో లేబర్ కోడ్ లు అమలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగా కార్మికులపై కొత్త కొత్త నిబంధనలు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్న కూడా ఏఐటియుసి వాటిపై స్పందించకుండా వారి పైరవీలకే పరిమితం అవుతుండడం కార్మికులు గమనించాలన్నారు.

ఇటీవల సర్ఫేస్ కు వచ్చిన జనరల్ అసిస్టెంట్ల బేసిక్ ప్రొటెక్షన్ పై కోర్టు తీర్పును ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలన్నారు. యూనియన్ బలోపేతం కోసం ప్రస్తుతం శ్రీరాంపూర్ కమిటీని 22 మందితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీకి కన్వీనర్ గా రామగిరి రామస్వామిని ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వివిధ గనుల నుంచి హాజరైన ఆఫీస్ బేరర్స్ తో పాటు పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.